ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి
'హింసపై మహిళల పోరుయాత్ర'కు
జిల్లాలో అపూర్వ స్వాగతం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
ప్రముఖ సాంఘిక ఉద్యమకారులు కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో మహిళలపై నేడు జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా విశాల పోరాటాలు చేయాలని, దీనికి నేటితరం యువత కలిసి రావాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి పిలుపునిచ్చారు. హింసపై మహిళల పోరుయాత్ర పేరుతో ఐద్వా ఆధ్వర్యాన చేపట్టిన రాష్ట్రజాతా బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. గోకవరం, కోరుకొండ, రాజమహేంద్రవరం, కడియం మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల సభలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాల విద్యార్థులు జాతాకు ఘన స్వాగతం పలికారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ మణిపూర్‌లో జరుగుతున్న అమానష ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ఇంటర్నెట్ నిలిపివేయటం, నెల రోజుల అనతరం కేసులు నమోదు చేయటం బిజెపి అలసత్వానికి నిదర్శనమన్నారు. 79 రోజుల వరకూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా ఉద్యమాలు మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సాంఘిక ఉద్యమాలకు కేంద్రమైన రాజమహేంద్రవరంలో నేటితరం ఐద్వా చేస్తున్న ఈ పోరాటాలలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కందుకూరి సేవలను గుర్తు చేస్తూ స్త్రీ విద్య కోసం స్థాపించిన విద్యా సంస్థల ప్రత్యేకతను తెలియజేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయనం చేయటానికి నిపుణులతో కమిటీ వేయాలని కోరారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. నిందితులను ఫాస్ట్ ట్రాక్‌కోర్టుల ద్వారా త్వరిగతిన విచారణజరిపి కఠినమైన శిక్షలు విధించాలని అన్నారు. ప్రభుత్వం మీడియా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. హింస, అశ్లీలత, అసమానతలను ప్రేరేపించే చలనచిత్రాలు, టీవీ సీరియల్స్, ఇంటర్నెట్ కార్యక్రమాలను నిషేదించాలని అన్నారు. తొలుత విద్యార్థులతో మాట్లాడించారు. ఇంటర్మీడియెట్ విద్యార్థి రమ్య మాట్లాడుతూ మణిపూర్‌లో జరిగిన దారుణాలు తనను కలచి వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం ఎటుపోతోందనే ఆందోళన ప్రతి ఒక్కరినీ వెంటాడుతోందని తెలిపారు. స్త్రీ దేవతలను పూజిస్తూ మహిళలకు కనీస గౌరవం ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థి రజని మాట్లాడుతూ మహిళలకు రక్షణకల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మణిపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మరో విద్యార్తి బ్యూలా రాణి మాట్లాడుతూ మణిపూర్‌లో సైనికుని భార్యకే రక్షణ లేకపోవటం బాధాకరమన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి వై. సత్యవతి మాట్లాడుతూ ఐద్వా ఏర్పాటు, స్త్రీల హక్కుల కోసం నిర్వహించిన పోరాటాలను, సాధించిన విజయాలను విద్యార్థులకు తెలియజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజా మాట్లాడుతూ విద్యార్థి, మహిళా ఉద్యమాలకు ఎస్‌ఎఫ్‌ఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. పాల్గొన్న విద్యార్థుందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
4దేవీచౌక్ సెంటర్‌లో యాత్రకు మహిళా, ప్రజాసంఘాలు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రభావతి మాట్లాడారు. జూలై 28వ తేదీన ప్రారంభమైన మహిళ పోరు యాత్ర ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చులకన భావం ఉందని స్త్రీలను రెండవ స్థాయి వ్యక్తులుగా లైంగిక వస్తువులుగా మనువాద బిజెపి మూకలను రెచ్చగొడుతుందన్నారు. పోక్సో చట్టాన్ని ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్నారనానరు. మద్యపాన నిషేదాన్ని అమలు చేయాలన్నారు.
4కడియంలో అంగన్‌వాడీలు, ఆశాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు జాతాకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొబ్బిలి బ్రిడ్జి సెంటర్లో జరిగిన సభలో ప్రభావతి మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి మాట్లాడుతూ మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. మహిళా చట్టాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఈ యాత్రలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.పూర్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్.రమణి, జిల్లా అధ్యక్షులు జరీనా, సీనియర్ నాయకులు సావిత్రి, స్రవంతి, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు కె.బేబిరాణి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటలక్ష్మి, యానిమేటర్ల యూనియన్ నాయకులు ప్రమీల, శ్రామిక మహిళ నాయకులు నాగమణి, అన్నపూర్ణ, మాలతి, కమల, విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.










