May 05,2023 22:38

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం జిల్లాలో వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా క్రింద 522 మంది లబ్ధిదారులకు రూ.3.82 కోట్ల ఆర్థిక సాయాన్ని పెళ్లి కుమార్తెల తల్లులు ఖాతాలకు జమ చేసినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా కింద జనవరి, ఫిబ్రవరి, మార్చి 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి జమ చేశారు. స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ మాధవీలత, రూడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిల రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌ తేజ్‌ భరత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు కింద పేద కుటుంబాలకు చెందిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల ఆడపిల్లలకు వివాహ సమయంలో ఆర్థిక చేయూతనిస్తున్నట్టు తెలిపారు. పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లల వివాహ సమయంలో సామాజిక బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత స్పష్టం చేశారు. ఇందుకు కనీస విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించడం ద్వారా విద్య యొక్క అవశ్యకతకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాలోనే, అదే కులంలో వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జగనన్న ప్రభుత్వం వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ ఎస్‌.సుభాషిణి, ఎపిఎం మాలతి పాల్గొన్నారు.