Oct 03,2023 23:44

ఉప్పు కారాలతో మొదలై కూరగాయలు, పండ్ల వరకు 45 కేసులు పెడుతున్న వ్యాపారుల్లో మార్పు లేమి
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
'కల్తీకి కాదేది అనర్హం' అన్నట్లుగా పండ్లు, వంట నూనెలు, ఉప్పు, పప్పులు సైతం కల్తీమయం అవుతు న్నాయి. ఏం కొనుగోలు చేయాలో వినియోగదారులకు అర్థంకాని పరిస్థితి ఎదురవుతోంది. బియ్యం వండి తిందామంటే వరి పైర్లకు మోతాదు మించి ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్నారు. దిగుబడి పెంచుకునేందుకు వీటిని వినియోగిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. కూరగాయాల్లో సైతం క్రిమిసంహారక అవశేషాలు ఉంటున్నాయి. దీంతో శరీరానికి పోషక పదార్థాల స్థానంలో పురుగుమందులతో కూడిన ఆహారం లభిస్తుంది. ఆకుకూరలకు సైతం క్రిమిసంహారక మందులనే పిచికారీ చేస్తున్నారు.
ఆహార పదార్ధాల్లో కల్తీ
జిల్లాలోని రేషన్‌ డిపోల ద్వారా అందజేసే బియ్యాన్ని కెజి రూ.18 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి వాటిని మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేస్తున్నారు. క్వింటా సాంబ మసూరిలో 10 కిలోల దాకా రేషన్‌ బియ్యం కలిపి వ్యాపారులు లాభం పొందుతున్నారు. బియ్యం నిల్వ చేసేందుకు సైతం రసాయనాలు తప్పడం లేదు. మరోవైపు కారంలోనూ కల్తీ జరుగుతోంది. రంపపు పొట్టులో రసాయనాలు కలిపి కారాన్ని తయారు చేసి దుకాణాలకు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ఈ కల్తీ కారం జిల్లాకు జోరుగా దిగుమతి అవుతోంది. 50 కిలోల బస్తాలను జిల్లా కేంద్రంలోని కొన్ని హోల్‌సేల్‌ దుకాణాలు దిగుమతి చేసుకుంటున్నాయి. వారు 250 గ్రాములు, 500 గ్రాములు, కిలో ప్యాకింగ్‌ చేసి దుకాణాలకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కారం ధర రూ.180 ఉంటే, కల్తీ కారం కేవలం రూ.100కే లభిస్తుంది. దీంతో హోటళ్ల నిర్వాహకులు ఈ కారం కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. కొంతమంది వ్యాపారులు వేరుశనగ నూనెను సైతం కల్తీ చేసి తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. పండ్లు తొందరగా మగ్గేందుకు ఇథపాన్‌ పౌడర్‌ను ప్రభుత్వ నిబంధనలకు మించి వినియోగిస్తున్నారు.
రెండోరకం వస్తువుల విక్రయాలు
జిల్లా కేంద్రంలోని ప్రముఖ మార్కెట్లో కొంతమంది దుకాణదారులు ప్రతీది రెండోరకం వస్తువులను విక్రయిస్తున్నారు. కంది, శనగపప్పు, పెసరపప్పు, పంచదార, మినపప్పు తదితర నాసిరకం ఉన్న వాటిని విక్రయిస్తున్నారు. నాణ్యమైన పప్పు ధరకు తక్కువకు రెండోరకం వస్తువులు పప్పును విక్రయిస్తున్నారు. ప్రతీ పప్పు కిలో రూ.20 నుంచి రూ.30 దాకా తేడా ఉంటోంది. తక్కువ ధర అని చెబుతూ, వినియోగదారులకు వాటిని అంటగడుతున్నారు. అదే విధంగా పాలల్లోనూ కల్తీ జరుగుతోంది. జిల్లా కేంద్రంతోపాటు కొన్ని ముఖ్యపట్టణాలలో ప్రైవేట్‌ డెయిరీల నుంచి పాలు సరఫరా అవుతున్నాయి. పాలల్లో కూడా కొన్ని రసాయనాలు కలిపి చిక్కగా ఉండేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ డెయిరీలు సైతం తయారీ తేదీకి మరుసటి రోజు తేదీ వేసి విక్రయిస్తున్నాయి. దీనిపై పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు విన్పిస్తున్నాయి.
45 కేసులు నమోదు
మే నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో 45 కేసులు నమోదు చేశాము. కల్తీ ఆహార పదార్ధాలు విక్రయిస్తే కోర్టు జరిమానాలతోపాటు జైలు శిక్ష విధిస్తుంది. 34 కేసులు జ్యుడిషియల్‌ పరిధిలో ఉన్నాయి. 11 కేసులకు సంబంధించి రూ.3 లక్షలు అపరాధ రుసుం వసూలైంది. ఆహార పదార్ధాలు వండే క్రమంలో టేస్టింగ్‌ సాల్ట్‌, రంగులు వాడటం నిషేదం. వంట గదులలో శుభ్రత తప్పనిసరిగా పాటించాలి. వంట నూనె రెండు సార్లుకు మించి వినియోగించకూడదు. ప్రతి ఒక్కరూ లైసెన్సులు తప్పనిసరిగా తీసుకోవాలి. లేని పక్షంలో చర్యలు తీసుకుంటాము.
రుక్కయ్య, జిల్లా ఆహార భద్రత అధికారి, తూర్పుగోదావరి జిల్లా