ప్రజాశక్తి- కడియం
నిత్యం వాహనాలతో రద్దీగా వుండే వేమగిరి నుంచి సామర్లకోట వెళ్లే కెనాల్ రోడ్డును పొగ కమ్మేస్తోంది. ఫలితంగా వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేమగిరి గ్రామంలో సేకరించిన చెత్తను వాహనాల ద్వారా తీసుకొచ్చి జిఎంఆర్ పవర్ ప్రాజెక్ట్ సమీపాన డంప్ చేస్తున్నారు. ఈ చెత్తను ప్రధాన పంటకాలువ ఒడ్డుకు నెట్టి నిప్పు పెడుతున్నారు. దీనివల్లే వచ్చే పొగ రహదారికి కమ్మేస్తోంది. కనీసం ఎదురుగా వచ్చే వాహనం కూడా కనబడనంతగా పొగ కమ్మేయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిత్యం పొగ కమ్మేయడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి పెను ప్రమాదం సంభవించకముందే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.










