స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను
అమలు చేయాలి
పంపుసెట్లకు మీటర్ల బిగింపు ఆపాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు
వి.కృష్ణయ్య
ప్రజాశక్తి - చాగల్లు
కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న విధానాల వల్లే వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సదస్సు శుక్రవారం చాగల్లు సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఉండవల్లి కృష్ణారావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడారు. పంటలన్నింటికి (ఆహార, వాణిజ్య, ఉద్యాన, సామాజిక వన పంటలు) సమగ్ర పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి చట్టబద్ద కనీస మద్దతు ధరలను నిర్ణయించాలన్నారు. రైతులు, పేదల పాలిట ఉరితాడు లాంటి విద్యుత్ బిల్లును పార్లమెంటులో ఉపసంహరించాలని కోరారు. వ్యవసాయ పంపుసెట్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లను బిగించరాదని డిమాండ్ చేశారు. కష్టపడి పండించిన పంటలకు కనీస ధరలు రాక నష్టాల్లో కూరుకుపోయిన రైతుల పంట రుణాలను రద్దు చేయాలన్నారు. కేరళ తరహా 'రైతు రుణ ఉపశమన చట్టం'ను పార్లమెంటులో ఆమోదించి రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా సదస్సులో రైతాంగ సమస్యలపై తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ గారపాటి వెంకటసుబ్బారావు ప్రవేశపెట్టగా సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు హాజరయ్యారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర్‌బాబు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు రైతాంగ డిమాండ్లకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంకటాల బుద్దుడు, కొడవటి వెంకటరాయుడు, కొఠారు నాగేశ్వరరావు రామనాథం, మురళీకృష్ణ, కడారి ప్రభాకర్‌రావు, ఉండవల్లి రామారావు, ఎం.శంకరం, కెకె.దుర్గారావు, నాయకులు పాల్గొన్నారు.
ఛాగల్లు షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని రాస్తారోకో
చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ తక్షణం ప్రారంభించాలని డిమాండ్. చేస్తూ శుక్రవారం చాగల్లు సెంటర్‌లో ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా చాగల్లు ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేసిన వారు, అధికారం వచ్చిన తరువాత మాటతప్పారన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి, వ్యవ సాయం కూలీలకు, కార్మికులకు, ఉపాధి కల్పిస్తున్న ఫ్యాక్టరీని తక్షణం ప్రారంభించాలన్నారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.










