Aug 25,2023 23:34

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో సమరభేరి మోగిస్తోంది. అధిక ధరలు తగ్గించాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, పెంచిన విద్యుత్‌ఛార్జీల భారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు సమరభేరిలో భాగంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ తెలిపారు. శుక్రవారం శ్యామల సెంటర్‌ వద్ద నున్న సిపిఎం కార్యాలయంలో సమరభేరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమరభేరి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. సమరభేరిలో భాగంగా కరపత్రాల ద్వారా ప్రచారం జరిపి ప్రజల నుంచి సంతకాలను సేకరిస్తామన్నారు. సెప్టెంబరు 1న సచివాలయాల్లో అర్జీలు అందజేస్తామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్‌ 4న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేవరకు ప్రజా సమస్యలపై పోరాటాలను కొనసాగిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, జిల్లా కమిటీ సభ్యులు బి.రాజులోవ, నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.