ప్రజాశక్తి-రాజమహేంద్రవరం కేంద్ర బడ్జెట్‌లో నరేంద్రమోడీ ప్రభుత్వం సామాన్యులను విస్మరించిందని, టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తూ మాటలతో మభ్య పెట్టిందని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ విమర్శించారు. 2023-24 సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రతులను పార్టీ ఆధ్వర్యాన గురువారం శ్యామలా సెంటర్‌లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రజా బడ్జెట్ అని అభివర్ణిస్తూనే సంక్షేమానికి ఎడాపెడా కోతలు పెట్టారన్నారు. దేశం మాంద్యం ముంగిట నిలిచిందని, ధరలు మరింతగా పెరిగి సామాన్యుల జీవితాలను అతలాకుతం చేసే ప్రమాదం ఉందంటూ ఆర్థికసర్వే చేసిన హెచ్చరికనూ పెడచెవిన పెట్టారన్నారు. సామాన్యులకు, కష్టజీవులకు ఆలంబనగా నిలిచిన ఉపాధి హామీ పథకం నుంచి ఆహార సబ్సిడీ వరకు అన్నిటికీ నిధులు తగ్గించడాన్ని దుర్మార్గమని అన్నారు. ఉపాధిహామీ పథకంలో రూ.30 వేల కోట్లు, ఆహార సబ్సిడీ పథకంలో ఏకంగా రూ.90 వేల కోట్ల కేంద్రం కోత పెట్టిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేసే చర్య ఒక్కటంటే ఒక్కటీ కూడా బడ్జెట్‌లో ప్రస్తావనకు నోచుకోలేదన్నారు. నిరుద్యోగం తీవ్రంగా ప్రబలుతున్న వేళ ఉద్యోగ, ఉపాధి కల్పన అంశాలనైనా కేంద్రం పట్టించుకుంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురయ్యిందని చెప్పారు. రాష్ట్రాలకు చేసే కేటాయింపుల్లోనూ కోతలు పెట్టి సమాఖ్య స్ఫూర్తిపై దాడి చేసిందన్నారు. విద్య, వైద్య రంగాలకు గత బడ్జెట్‌లో జరిపిన అరకొర కేటాయింపులను కూడా ఖర్చు చేయలేదని సవరించిన బడ్జెట్ అంచనాలు తెలియచేస్తున్నాయన్నార. ఇది మోడీ సర్కార్ కార్పొరేట్ మిత్రుల బడ్జెట్ అని, యువతకు ఉద్యోగ కల్పనకు విజన్ లేదని, ధరల పెరుగుదలను నియంత్రించే ప్రణాళిక లేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు మొండి చెయ్యి చూపించింన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా జగన్ నోరు విప్పక పొవడాన్ని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే జనసేన పవన్ కళ్యాణ్ బడ్జెట్‌ను సమర్థించడాన్ని తప్పుపట్టారు. రాజమహేంద్రవరం ఎంపీ బడ్జెట్‌పై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, నాయకులు టిఎస్.ప్రకాష్, ఎస్‌ఎస్.మూర్తి, సావిత్రి, పూర్ణిమరాజు, రాము, సుబ్రహ్మణ్యం, రాజా, ఉమా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










