ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో కౌలు రైతులకు సాయం అందేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. జిల్లా రైతాంగం ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధమవుతున్న విషయం విధితమే. ఈ నేపధ్యంలో ప్రభుత్వ సాయం లభించని రైతులు ప్రైవేట్ అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రతి ఏటా జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా ప్రతి ఏటా సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. సాధారణ రైతులతో పోల్చితే కౌలు రైతులకు ప్రత్యక్షంగా కౌలు భారంతో పాతటు పరోక్షంగా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. బ్యాంకు రుణాలతో మొదలై, పంటలకు బీమా, దిగుబడులకు మద్దతు ధరా పూర్తిగా ఎండమావిలా మారుతున్నాయి. రైతులు, రైతు సంఘాల పోరాటాల ఫలితంగా పాలక ప్రభుత్వాలు ఎట్టకేలకు కౌలు రైతులకోసం సిసిఆర్ (క్రాప్ కల్టివేటర్ రైట్) కార్డులను అందజేశాయి. కానీ రైతుల సంక్షోభాన్ని ఈ కార్డులు ఏమాత్రం పరిష్కరించడం లేదు. ఈ కార్డులు అందించేందుకు భూయజమాని అనుమతి తప్పనిసరి చేయడమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది.
అత్యధిక మంది సాగుదారులు కౌలు రైతులే...
తూర్పు గోదావరి జిల్లాలో లక్ష మందికిపైగా కౌలు రైతులు ఉండటారని అంచనాగా తెలుస్తోంది. సాగు వ్యయంలో కౌలుతో సహా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత వెచ్చించినా ప్రకృతి విపత్తులతో పంట చేతికి రాని సందర్బాలు అధికంగా ఉంటున్నాయి. దీంతో భారీగా కౌలు రైతులు నష్టపోతున్నారు. సిసిఆర్ (క్రాప్ కల్టివేటర్ రైట్) కార్డులు అందజేయడం ద్వారా కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 50 శాతం మంది కౌలు రైతులు గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఫలితంగా పెట్టుబడి సాయం, పంట ఉత్పత్తులను అమ్ముకోవడం, నష్ట పరిహారం లేదా ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, పంటల రుణం ఇలా ఏది వర్తించాలన్నా సిసిఆర్ కార్డు లేక ఇబ్బందలు పడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అధికారులు సకాలంలో స్పందించి కౌలు రైతులందరికీ సిసిఆర్ కార్డులు అందజేయాలని కౌలు రైతు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కౌలు రైతులకు సాయం కరువు
సొంత భూమి ఉన్న రైతులు ప్రభుత్వం అందించే అరకొర రాయితీ విత్తనాలతో పాటు ఇప్పటికే వారి ఖాతాలో జమ అయిన రైతు భరోసా కొంత ఊరటనిస్తోంది. దీంతో సాగుకు సిద్ధమవుతున్నారు. కానీ కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగామారింది. సిసిఆర్‌సి కార్డుల ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. గతంలో కార్డులు ఉన్న రైతులు కూడా మళ్లీ రెన్యువల్ చేయించుకుంటేనే మనుగడలోకి వస్తుంది. భూ యజమాని అనుమతితో కార్డును రెన్యువల్ చేయించుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తం మేలో ముగించి ఖరీఫ్ ప్రారంభమయ్యే జూన్ నెల మొదటి రెండు వారాల్లో రైతులకు కార్డులు ఇవ్వాలి. ఈ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నారు మడులు వేసుకునేందుకు రైతులు ప్రైవేట్ ఆప్పులను ఆశ్రయిస్తున్నారు. మరో వైపు కౌలు ఒకొక్క మండలంలో ఒకొక్క విధంగా వసూలు జరుగుతోంది. నీటి సౌకర్యం బాగా ఉంటే ఎకరాకు వేలకు వేలు కౌలు కట్టాలి. లేదా పంటలో మూడో వంతు చెల్లించాల్సి వస్తుంది. ప్రకృతి విపత్తులతో నష్టం వచ్చినా కౌలు చెల్లించక తప్పడంలేదు. మార్కెట్‌లో ధర లేకపోయినా నష్టపోవాల్సిందే. ఈ బాధలు పడలేక చాలామంది వ్యవసాయానికి దూరమవుతున్నారు.
భూ యజమానులు వెనకడుగు
భూ యజమానులు అనుమతి పత్రాలు అందించేందుకు వెనకడుగు వేయడంతో కౌలు రైతులు ప్రభుత్వ ఫలాలకు దూరమవుతున్నారు. కౌలుదారులకు న్యాయం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ముందు భూ యజమానులకు సిసిఆర్ కార్డులపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. కౌలు రైతులకు ఈ కార్డు ఇవ్వడానికి అంగీకరిస్తే తమ భూహక్కుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజెప్పాలి. ఈ కార్డు మనుగడలో ఉండేది కేవలం 11 నెలలే కాబట్టి తరువాత యజమాని కౌలుదారును మార్చుకున్నా లేక కౌలును రద్దు చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించాలి. కానీ క్షేత్ర స్థాయిలో వీటి మీద అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం అంతగా శ్రద్ధ చూపడం లేదు. దీనివల్ల జిల్లావ్యాప్తంగా 50 శాతం మంది మాత్రమే కౌలు రైతులుగా గుర్తింపు పొందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా జిల్లా రైతాంగానికి ఇచ్చే వేల కోట్ల రుణ పద్దులో కౌలు రైతుల వాటా 10 శాతం ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవానికి ఈ వాటా చాలా తక్కువగా ఉంటోంది. వీరికి అందించే రుణం 2 శాతం కూడా దాటడం లేదు.










