జిల్లాలో ప్రారంభమైన వరి కోతలు
అడ్డుగోడలుగా మారిన నిబంధనలు
ధాన్యం విక్రయాలకు ప్రతి ఏటా దళారులే దిక్కు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
ఖరీఫ్ సాగులో వరి పంట కోతలు ప్రారంభం అయ్యాయి. ధాన్యం అమ్ముకునేందుకు కౌలు రైతులు సిద్దమయ్యారు. అయితే గతంలో మాదిరిగానే ఈ ఏడాది కౌలు రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. దీనికి ప్రభుత్వం నిబంధనలే అడ్డుగా నిలుస్తున్నాయి. ప్రతి ఏటా ధాన్యం అమ్ముకునేందుకు నెలల తరబడి వేచి చూస్తున్న వారు కొందరైతే, కొనేవారి కోసం ఎదురుచూసేవారు మరికొందరు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నపూర్ణగా పిలవబడే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ సాగులో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. అధికారుల గణాంకాల ప్రకారం 5.93 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్ సాగు జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కౌలు రైతులు 3.50 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా. సాగు విస్తీర్ణంలో 80 శాతానికి పైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారు. రెండు పంటలకు 20 నుంచి 30 బస్తాల చొప్పున కౌలు చెల్లిస్తూ, మిగిలిన పంట అమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్నారు కౌలు రైతులు . ఒక ఎకర సాగుకు అక్షరాల రూ. 45,000 పెట్టుబడి అవుతోంది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రాయితీ, రుణాల అందించడం నుంచి చివరికి పంట అమ్ముకునే వరకు కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఏటా దళారులను ఆశ్రయించక తప్పదు
పంటలు అమ్ముకునేందుకు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు ధాన్యం విక్రయించేందుకు కౌలు రైతు గుర్తింపు కార్డులతో పాటు, ఆ భూమిని ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 3.50 లక్షల మంది కౌలు రైతులు ఉండగా అధికార యంత్రాంగం కేవలం 1.11 లక్షల మందికి మాత్రమే కౌలు రైతు గుర్తింపు కార్డులు అందజేసింది. భూ యజమాని అంగీకార పత్రాలు ఇవ్వకపోవడంతో అత్యధిక మంది కౌలు గుర్తింపు కార్డులకు అర్హత కోల్పోయారు. ఆ విధంగా జిల్లాలో 2.39 లక్షల మంది కౌలు రైతులు ఖరీఫ్ పంటను పంటను దళారులకు విక్రయిం చక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత రబీ సాగులో ప్రభుత్వ మద్దతు ధరకు కంటే 30 శాతం నుంచి 40 శాతం తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. కోతల సమయంలో వర్షాలు కురవటంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుర్తింపు కార్డులు ఉన్న కౌలు రైతులు సైతం నష్టపోయారు. ఎకరా పంటకు 25 బస్తాల దిగుబడి వచ్చింది. అయితే రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ఎకరాకు 20 బస్తాలకే పరిమితం కావటంతో అదనపు పంట ఇంటికే పరిమితం అయింది. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
అడ్డుగోడలుగా ప్రభుత్వ నిబందనలు
ఈ క్రాప్‌లో నమోదుతో అన్ని ప్రయోజనాలను కౌలుదారులకు వర్తింపజేస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో సిసిఆర్‌సి కార్డునే ప్రామాణికంగా యంత్రాంగం తీసుకొంటోంది. మరోవైపు తేమ శాతం సమస్య తలెత్తుతోంది. జిల్లాలో రైతులకు ధాన్యం ఆరబెట్టుకునేందుకు ఎటువంటి సౌకర్యాలు లేవు. దీంతో కళ్లాల్లోనూ, రోడ్లపైనా ఆరబెట్టుకోవల్సి వస్తుంది. కొన్ని సార్లు తేమ శాతాన్ని సాకుగా చూపించి ధాన్యం కొనుగోలు ఆలస్యం చేస్తున్నారు. ధాన్యం కోసిన అనంతరం నిల్వ చేసుకునే సౌకర్యాలు లేక దళారులను ఆశ్రయించక తప్పటం లేదు. అదేవిధంగా సాంకేతిక సమస్యలు, గన్ని బ్యాగుల కొరత వంటి సమస్యలతో గతేడాది ఇబ్బందులు తప్పలేదు. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.
పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలి
ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో కౌలు గుర్తింపు కార్డులు అందజేయలేదు. అత్యధిక కార్డులు భూ యజమానుల వద్ద ఉన్నాయి. కొనుగోలులో కౌలురైతుకు ప్రభుత్వం సహకరించాలి. సిసిఆర్‌సి కార్డులతో సంబంధం లేకుండా ప్రతి సాగుదారుని వద్ద ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, నగదు కూడా అతని ఖాతాకే జమ చేసేలా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా గత అను భవాల దృష్ట్యా ఆన్‌లైన్ సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. గన్ని బ్యాగులు అదుబాటులో ఉంచాలి. ఆర్‌బికెల్లో తరుగు పేరుతో కోత విధించటంపై అధికారులు దృష్టి సారించాలి.
- వల్లు రాజబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి










