Feb 04,2023 23:26

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం పని చేస్తుండగా మట్టి పెళ్లలు పడి మృతి చెందిన దళిత కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బంధువులు, గ్రామస్తులు సిఐటియు ఆధ్వర్యాన రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రివద్ద శనివారం రోడ్డుపై బైఠాయించారు. కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామానికి చెందిన బి.రాంబాబు వంతెన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మట్టి పెళ్ళలు పడి చికిత్స పొందుతూ మరణించాడు. 24 గంటలు గడుస్తున్నా కాంట్రాక్టర్‌ నుండి ఇలాటి స్పందనా లేకపోవడంతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు పాల్గొని మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ దళిత కార్మికుడు రాంబాబు చనిపోయి 24 గంటలు గడుస్తున్నా కాంట్రాకర్‌ నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేకపోవడం దుర్మార్గం అన్నారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా 12 అడుగుల లోతులో దింపడం వల్ల కార్మికుడి ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మృతుని కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.