ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఎపి పేపర్ మిల్లు కార్మికుల రిలే నిరాహార దీక్షకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్, జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు శనివారం మద్దతు తెలిపారు. వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. పేపర్ మిల్లు కార్మికులు తమ న్యాయమైన కోర్కెల సాధనకు 25 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తుంటే యాజమాన్యం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే యాజమాన్యం తన మొండి వైఖరి వదిలి కార్మికులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యాజమాన్యం గుర్తింపు ఎన్నికలు వెంటనే జరపాలని, క్యాంటీన్ రేట్లను తక్షణమే తగ్గించాలని, కాంట్రాక్టు కార్మికులను సీనియారిటీ ప్రకారం పర్మినెంట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న క్వార్టర్స్‌ను బాగు చేయించి తక్షణమే కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. శనివారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో కార్మికులు టి.నాగేశ్వరరావు, వి.రాజా, ఎం.కిషోర్, టి.సత్యనారాయణ, కె.అప్పలకష్ణ, జి.అప్పారావు, ఎస్‌పి.యాదవ్, బి.శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.










