Feb 09,2023 22:51

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ఎపి పేపర్‌ మిల్లు కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు గురువారం 30వ రోజుకు చేరిన నేపథ్యంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు వారికి మద్దతు తెలిపారు. దీక్షలో ఆయన మాట్లాడుతూ పేపర్‌ మిల్లు కార్మికులు తమ న్యాయమైన కోరికల కోసం 30 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తుంటే యాజమాన్యం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే యాజమాన్యం తన మొండి వైఖరిని వదిలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. యాజమాన్యం గుర్తింపు ఎన్నికలు వెంటనే జరపాలని, గతంలో కార్మికులు రోజుకు రూ.5కే లభించే ఆహారం ఈరోజు రూ.70 అవుతోందని, కార్మికుని జీతం మాత్రం రూ.8,500 అలాగే ఉందని చెప్పారు. ఫ్యాక్టరీల్లో క్యాంటీన్‌ లాభాల కోసం కాదన్నారు. గతంలో క్యాంటీన్‌ టోకెన్ల బుక్‌ రూ.25 ఉండేదని దాన్ని రూ.395 చేయడం దుర్మార్గమన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న క్యాంటీన్‌ను యాజమాన్యం తన ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచడం సరికాదన్నారు. ఎగ్రిమెంట్‌ చేసేటప్పుడు కార్మికులతో చర్చించి చేయాలని తక్షణమే రేట్లను తగ్గించాలని, కాంట్రాక్టు కార్మికులను సీనియారిటీ ప్రకారం పర్మినెంట్‌ చెయ్యాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్స్‌ను బాగుచేయించి తక్షణమే కార్మికులకు కేటాయించానలి, అలవెన్సులు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎపి పేపర్‌ మిల్లు పోరాటానికి సిఐటియు, జిల్లా కార్మిక సంఘాలు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాయని తెలిపారు. నిరాహార దీక్షలో ఎస్‌.వెంకటేశ్వరరావు, ఇవి.వెంకటరావు, జిఎస్‌ఆర్‌.రెడ్డి, జి.నాగేంద్ర, బి.రామారావు రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్నారు.