May 15,2023 00:35

ప్రజాశక్తి - పెద్దాపురం కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి అన్నారు. మే డే పక్షోత్సవాల్లో భాగంగా పెద్దాపురం మండలం వడ్లమూరు గాంధీ బొమ్మ సెంటర్లో క్వారీ లారీ యూనియన్‌ డ్రైవర్ల సంఘం ఉపాధ్యక్షులు అల్లాడి సూరిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కార్మికుల నిజ వేతనాలు రోజురోజుకూ పడిపోతున్నాయన్నారు. కనీస వేతనాలు అమలు చేయమన్నా, కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించమన్నా కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒకదాని తర్వాత ఒకటి అదానీకి కట్టబెడుతూ కార్మికులపై భారాలను మోపుతున్నాయన్నారు. కార్పొరేట్ల లాభాల కోసం కార్మిక హక్కులను కాలరాస్తున్నాయన్నారు. ఈ విధానాలను ప్రతిఘటించే కార్యక్రమాల్లో కార్మికులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల ఉపాధ్యక్షులు దాడి బేబీ,ఎన్‌ సూరిబాబు, నూర్జహాన్‌, ప్రసన్న కుమారి,డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.