ప్రజాశక్తి-పెరవలి కానూరు అగ్రహారంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో బుధవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొందరికి ఒకచేత్తో ఇస్తూ మరో చేత్తో అందరి వద్దా పన్నుల రూపంలో 10 రెట్లు అధికంగా దోచుకుంటోందని ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వంలో కానూరు అగ్రహారం గ్రామ ప్రజల కోరిక మేరకు రూ.15 లక్షలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసి స్లాబు వరకు నిర్మిస్తే ఇప్పటి ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. జగనన్న ఇళ్ల పట్టాలలకు గ్రామంలో 120 మందిని గుర్తించినా ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. దీన్ని బట్టి ఆలోచిస్తే నూటికి పదిమందికి ప్రభుత్వ పథకాలు ఇచ్చి మిగిలిన 90 శాతం ప్రజలను మోసం చేయడమే జగన్ ప్రభుత్వ ఉద్దేశం అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దాసం బాపన్నాయుడు, భూపతిరాజు రవివర్మ, అతికాల రామకృష్ణమ్మ, బొడ్డు రామాంజనేయులు, వాకలపూడి వీర్రాజు, అబ్బిశెట్టి సత్తిరాజు, మంగం రామారావు, హనుమంతు సుబ్రహ్మణ్యం, ముళ్లపూడి రాజేంద్రప్రసాద్, కొమ్మిశెట్టి వెంకట కృష్ణారావు, శిరిగినీడి శేషగిరిరావు, హరిదాసు చిన్నా, బీర సామ్యేల్‌రాజు, పిల్లి గోపన్న పాల్గొన్నారు.










