ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
విఒఎ, ఆర్‌పిలకు మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకటలక్ష్మి, ఎపి వెలుగు విఒఎ (యానిమేటర్స్ ) ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు జి.ప్రమీల, స్వరూప డిమాండ్ చేశారు. ఎపి వెలుగు విఒఎ(యానిమేటర్స్ )ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటి పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ కార్యాలయ ఎఒకి అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తమకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, వైసిపి ప్రభుత్వం వచ్చాక విఒఓ, ఆర్‌పిలకు ఇచ్చిన మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 20 గ్రూపుల కంటే తక్కువగా ఉన్నాయనే పేరుతో విఒఓలకు వేతనం వేయకపోవడం దారుణమన్నారు. డ్వాక్రా గ్రూపులు మెర్జ్ చేసి విఒఎలను తొలగిస్తున్నారని, రాజకీయ కక్షలతో యానిమెటర్లపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, మహిళా మార్ట్‌లో వస్తువులు కొనుగోలు చేయాలని, డ్వాక్రా సభ్యులు చేత కొనుగోలు చేయిం చాలని లక్ష్యాలను నిర్ధేశించడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. ఉన్నత స్థాయిలో జరుగుతున్న అవినీతికి కిందిస్థాయిలో విఒఎలను బలి చేస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విఒఓ, ఆర్‌పిలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌న నాయకులు ధనలక్ష్మి, వరలక్ష్మి, రమాదేవి, జి.విజయలక్ష్మి, ఎం.రత్నం, వి.రాజేశ్వరి, హేమలత, జి.శిరీష, పి.మేరీరత్నం, రేణుక, అనంతలక్ష్మి, వీరలక్ష్మి నాయకత్వం వహించారు.










