Jan 29,2023 22:40

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కవులు, అతిథులు

రచయిత, సామాజిక ఉద్యమకారుడు గౌరవ్‌
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిటీ
కాలాతీత ప్రేమాక్షర సౌధం 'ఉషామహల్‌' అని ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమ కారుడు గౌరవ్‌ అన్నారు. ప్రముఖ కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు సూర్యవంశీ తన దివంగత అర్ధాంగి ఉష స్మతిలో ప్రచురించిన ఉషా మహల్‌ కవితా సంకలనాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. సూర్యవంశీ ఇంటి ఆవరణలో సీనియర్‌ జర్నలిస్ట్‌ మలసాని శ్రీనివాస్‌ అద్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తర తరాలుగా కుటుంబాలలో కొనసాగుతున్న స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం, వివక్ష, పురుషాధిపత్యం,అణచివేతలను ఆ ఆర్ద్రంగా విశ్లేషించారన్నారు. వీటికి భిన్నంగా సూర్యవంశీ తన సహచరి పట్ల నిండు ప్రేమ, గౌరవంతో రాసిన ఉషామహల్‌ కవితా సంకలనం తెలుగు సాహిత్యంలో ఒక అరుదైన కావ్యమని పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత, హక్కుల కార్యకర్త బడుగు భాస్కర్‌ జోగేష్‌ మాట్లాడుతూ స్మతి కవిత్వంలో ఉషా మహల్‌ స్థానం అరుదైనది, విశిష్టమైనదన్నారు. నవ్య వ్యక్తీకరణ, గొప్ప గాఢతలతో ఉషా మహల్‌ కవిత్వం తొణికిసలాడుతుందని పేర్కొన్నారు. సంకలనంలోని కవితను వినిపించగా సమావేశం గంభీరంగా మారిపోయింది. ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు గౌరవ్‌ మాట్లడుతూ ఉద్యమకారుడు సూర్యవంశీ తన భార్య పట్ల గల ప్రేమ వ్యక్తీకరణ విభిన్నమైనదన్నారు. బహుశా ప్రపంచ సాహిత్యంలో సహచరిణిపై రాసిన తొలి కవిత్వ సంకలనం ఇదేనన్నారు. సూర్యవంశీ కవిత్వం మానవ సమాజంలో నిర్లక్ష్యం చేయబడ్డ పార్శంపై సహానుభూతి కలిగిందని, ఆయన కవిత్వం తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిందని ప్రముఖ అడుగుజాడ సంపాదకులు సామాజిక చైతన్య శీలి పిఎస్‌.రవికాంత్‌ అన్నారు. ప్రముఖ కళా వేత్త మాదేటి రాజాజీ మెమోరియల్‌ సంస్థ బాధ్యులు రవి ప్రకాష్‌ ప్రారంభోపన్యాసం చేశారు. మహారాష్ట్రలో పుట్టి అనేక ఉద్యమాల్లో స్రవంతులలో మమేకమై రాజమహేంద్రవరంలో స్థిరపడిన సూర్యవంశీ తన భార్య స్మతిగా తెలుగులో కవిత్వాన్ని సంకలనంగా వెలువరించిన తొలి కవి అన్నారు. సూర్యవంశీ మాట్లాడుతూ భార్యతో తనకుగల సుదీర్ఘ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఆమెపై గల సరళ సహజ అనురాగ భావంతో కూడిన ప్రగాఢ ప్రేమ కవిత్వమే ఉషా మహల్‌ అని, దీన్ని తన సహచరికి నివాళిగా అర్పించానని తెలిపారు. పుస్తక ప్రచురణలో సహకరించిన నామాడి శ్రీధర్‌, ఒమ్మి రమేష్‌బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బంధు మిత్రులు, స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభులు లత బిబాల చంద్ర, సంగీత, మోనితాదేవి, శివరాం, ప్రసన్న యగేష్‌, పుణ్య నాగలక్ష్మి, ఎస్‌.చౌదరి, ప్రతిభ, రోహిత్‌, లక్ష్మీభవాని, వశిష్ట, చిన్ను, సిద్దార్థ్‌, కౌషిక్‌, తనవి తదితరులు పాల్గొన్నారు.