Mar 06,2023 22:27

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో మినరల్‌ వాటర్‌ పేరుతో నాణ్యణా ప్రమాణాలు లేని ప్యాకేజి డ్రింకింగ్‌ వాటర్‌ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. వేసవి ప్రారంభం కావటంతో జిల్లాలో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. అత్యధిక మంది వ్యాపారులు బోరు నీటినే క్యాన్‌ల్లో నింపి.. విక్రయిస్తున్నారు. కలుషిత జలాలను సరఫరా చేస్తున్నారు. దీంతో చాలామంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా కుటుంబాలు క్యాన్లలో మినరల్‌ నీటినే వినియోగిస్తున్నారు. నీటికోసం సుమారు రూ.20కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా నీటిశుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేశారు. కర్మాగార యజమానులకు ఒక్కో 20 లీటర్ల క్యాన్‌ నీటి తయారీకి రవాణా ఖర్చులతో కలిపి రూ.6 కంటే ఎక్కువ కావడం లేదు. వినియోగదారులకు మాత్రం రూ.10 నుంచి రూ.20వరకు విక్రయిస్తూ దోచుకుంటున్నారు. 200 మిల్లీ లీటర్ల వాటర్‌ ప్యాకెట్లు తయారు చేసి. రూ.2 చొప్పున విక్రయిస్తున్నారు. వీటిపై తయారీ తేదీ ముద్రించడం లేదు కేవలం శుద్ధిచేసిన నీరు అనే నమ్మకంతో వినియోగదారులు వీటిని వాడుతున్నారు.
కొన్నింటికే అనుమతులు
జిల్లాలో సుమారు 680కిపైగా ఆర్‌ఒ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో కేవలం పదుల సంఖ్యలో నీటి శుద్ధి కర్మాగారాలకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఐఎస్‌ఐ ప్రమాణాలతో నీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలంటే రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెట్టుబడి కావాలి. జిల్లా పరిశ్రమల శాఖ, ఆర్‌డబ్యూఎస్‌ అధికారుల నుంచి అనుమతులు ఉండాలి. కానీ జిల్లాలో చాలామంది సుమారు రూ.3 లక్షల పెట్టుబడితో అనధికారికంగా నీటిశుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ.. కేవలం బోరు వాటర్‌ను క్లోరినేషన్‌ చేసి వడపోసి క్యాన్లలో నింపుతున్నారు. మరికొన్ని ఆర్‌ఒ ప్లాంట్లలో కనీసం వడపోత కూడా లేకుండా బోర్లు, మున్సిపాలిటీ కొళాయి వాటర్‌ను క్యాన్లులో నింపి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉంది.
ప్యాకేజి డ్రింకింగ్‌కు పాటించాల్సిన నిబంధనలు
ఆర్వో ప్లాంట్లలో ముందుగా నీటిని క్లోరినేషన్‌ చేయాలి. తర్వాత ప్రత్యేకమైన శాండ్‌ ఫిల్టర్‌ ద్వారా వడపోయాలి. ఆపై కార్బన్‌ ఫిల్టర్స్‌, మైక్రాన్‌ ఫిల్టర్స్‌ శుభ్రం చేసి మరో కంపార్టుమెంటులోకి పంపాలి. ఆఖరి దశలో ఆక్సిజన్‌ను పంపి ఆక్సీకరణ జరపాలి. ఈ దశలో మినరల్స్‌ను జతచేయాలి. కానీ ఆర్వో ప్లాంట్లలో ఈ దిశగా నీటిని శుద్ధి చేయడం లేదు. ఐఎస్‌ఐ ప్రమాణాలతో నడిచే ఆర్‌ఒ ప్లాంట్లు జిల్లాలో ఐదారు మాత్రమే ఉన్నాయి. నీటిశుద్ధి కర్మాగారాలపై తరుచూ తనిఖీలు నిర్వహించి నాణ్యతా ప్రమాణాలు పరీక్షించాలి. కానీ ఇంతవరకు ఒక్క ప్లాంటుపైకూడా తనిఖీలు లేవు. ఆహార తనిఖీ విభాగం, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు వీటి వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు. దీంతో కలుషిత నీటి వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. మినరల్‌ పేరుతో కలుషిత జలాలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.