Jun 05,2023 22:45

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులను ఊరించి.. ఉసూరు మనిపిస్తోంది. తమది రైతు ప్రభుత్వం అంటూ ఓపు గొప్పలు చెబుతూనే మరో వైపు శాశ్వత ప్రయోనాలు కల్పించే పథకాలకు మంగళం పలికింది. వ్యవసాయ యాంత్రీకరణలో కీలక భూమిక పోషించే యంత్ర పరికరాల పంపిణీ మొక్కుబడిగా సాగుతోంది. 2019 అనంతరం రెండేళ్లు బ్రేక్‌ పడింది. గతేడాది నుంచి ఎట్టకేలకు ప్రారంభమైంది. సూక్ష్మసేద్య పరికరాలు అందించే పథకాలకూ అదే దుస్థితి ఏర్పడింది. ప్రతిఏటా వేల సంఖ్యలో బిందు, తుంపర సేద్య పరికరాలు గత ప్రభుత్వాలు రైతులకు అందించేవి. దీనివల్ల తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలోని పంటలను సాగుచేసుకునే అవకాశం కలిగేది. అంతేకాక ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగేందుకు దోహదపడేది. ముఖ్యంగా వాణిజ్య పంటలు ఆయిల్‌పామ్‌, అరటి, జామ, కొబ్బది, మామిడి, జీడిమామిడి, సీతాఫలం తదితర వాటికి బిందు సేద్యం అనువుగా ఉంటుంది. కానీ వైసిపి ప్రభుత్వం సూక్ష్మ వ్యవసాయ విధానాలకు మంగళం పలికింది. దీంతో ఉద్యాన పంటల రైతులకు ఇబ్బందులు తప్పటంలేదు.
సూక్ష్మ సేద్యం, జళకళలకు ప్రోత్సాహం కరువు
రైెతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ సన్న, చిన్నకారు రైతాంగానికి వినియోగపడే సూక్ష్మ సేద్యం, జళకళ వంటి పధకాలకు ప్రోత్సాహం కరువైంది. జలవనరులు అందుబాటులో లేని మెట్ట రైతులకు బోర్లు ఏర్పాటు చేసేందుకు ప్రకటించిన జల కళ పథకాన్ని అమలు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నియోజకవర్గానికి ఒక రిగ్‌ బోరు ఏర్పాటు చేసి రైతులకు బోర్లు వేస్తామని ప్రకటించింది. నియోజవర్గానికి ఒక రిగ్గుకు బదులు ఒక బోరు పథకంగా పేరుమార్చి నీరుగార్చింది. ప్రస్తుతం ఆర్‌బికెల్లో రైతులు బిందు, తుంపర సేద్యం పరికరాల కోసం కంపెనీల వారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా రైతులు కీలకంగా భావించే జగననన్న జలకళ, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలు పండించే సూక్ష్మవ్యవసాయ పరికరాలను అందించడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతులకు మొండిచేయి
జిల్లాలోని సాగు విస్తీర్ణంలో అత్యధిక భూమి కౌలు రైతులు సాగు చేస్తున్నారు. పంట రుణాలు మొదలుకొని, రైతు భరోసా తదితర పధకాలన్నింటిలోనూ పాలక ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్ధకాలంగా యాంత్రీకణ అనివార్యంగా మారింది. సాగు ప్రారంభం నుంచి కోత దశ వరకూ పలు రకాల పరికాల వినియోగం గణనీయంగా పెరిగింది. యంత్రాల వినియోగంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో వ్యవసాయ పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవసాయ యాంత్రీకణ ఉపకరణాలైన ట్రాక్టర్లు, వీడర్లు, కలుపుతీసే యంత్రాలు, నాట్లు వేసే యంత్రాలు, స్ప్రేయర్లు, హార్వెస్టింగ్‌ యంత్రాలు తదితర పరికాలను ఏటా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.