ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న జగన్ నిరంకుశ వైఖరి నశించాలని, జిఒ నెంబర్ 1 జిఒను రద్దు చేయాలని కోరుతూ టిడిపి, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బిఎస్‌పి, ఆప్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జాంపేట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా జిఒ నెంబర్ 1 తీసుకొచ్చారన్నారు. ఈ జిఒకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్రంలో పలు ఆందోళనలు చేశామని, జిఒ వెనక్కి వెళ్లే వరకు ఉద్యమం ఆగదని ముప్పాళ్ల చెప్పారు. రూరల్ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఈ నల్ల జిఒ ప్రతిపక్షాలకేనా రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌కు వర్తించదా అని ప్రశ్నించారు. నడిరోడ్డు మీద నందగనిరాజు సెంటర్లో అడ్డంగా స్టేజి కట్టి నగర ప్రజలను ఇబ్బందులు పడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆయన విమర్శించారు. జనసేన పిఎసి సభ్యుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉల్లంఘనపై ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ జిఒ రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు టిఎస్.ప్రకాష్, సిఐటియు జిల్లా కార్యదర్శి పూర్ణిమ రాజు, కాంగ్రెస్ నాయకుడు బాలేపల్లి మురళి, టిడిపి నాయకులు రెడ్డి మణి, కాశి నవీన్ కుమార్, న్యూ డెమోక్రసీ నాయకులు జోజి రమణ, సిపిఐ నాయకులు వి.కొండలరావు, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి సునీల్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు రాజా, అఖిలపక్ష నేతలు మజ్జి రాంబాబు, వాసిరెడ్డి రాంబాబు, సేపేని రమణమ్మ, యడ్ల లక్ష్మి, జిఎ.రామారావు, ఆచంట సత్యనారాయణ, కె.జ్యోతిరాజు పాల్గొన్నారు.










