ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిఒ 1ను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష పార్టీల నాయకులు స్పష్టం చేశారు. గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం సెంటర్‌లో జిఒ నెంబర్ 1 రద్దు ఐక్య పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు సారథ్యంలో అఖిల పక్షం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల సుబ్బారావు రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రిటిష్ కాలం నాటి కాలం చెల్లిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు. సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్ మాట్లాడుతూ జిఒ1లో నిబంధనలు ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయన్నారు. వామపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అప్రజాస్వామికంగా, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా, ప్రతిపక్షాల గొంతును నొక్కే విధంగా జారీ చేసిన జిఒను వెంటనే రద్దు చేయాలని నినదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు రెడ్డి మణి, వామ పక్షాల నాయకులు నల్లా రామారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా, అశోక్ , పలు సంఘాల నాయకులు, ఎడ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










