Apr 23,2023 23:20

గోపాలపురం మండలంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

ప్రజాశక్తి - గోపాలపురం, దేవరపల్లి, తాళ్లపూడి
జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున అకాల వర్షం కురిసింది. ఈ వర్షానికి రైతులు నానా ఇబ్బందులకు గురయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో పొలంలో ఉంచిన ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. వీటిని జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యంపై ఐదుశాతం ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలన్నారు. దీని వల్ల మొలక రాకుండా ధాన్యం రంగుమారకుండా కాపాడుకోవచ్చన్నారు. రైతులకు గోనె సంచులను అందుబాటులో ఉంచాలన్నారు. మండలంలో 120 మెట్రిక్‌ టన్నుల వరకూ ధాన్యం తడిసినట్టు గుర్తించారు. వీటిని కళ్లాల నుంచి ఆర్‌బికెలకు తరలించే చర్యలు చేపట్టారు. ఆయన వెంట కొవ్వూరు ఎడిఎ పి.చంద్రశేఖర్‌, ఎఒ బి.రాజారావు, విఎఎ ఝాన్సీ రాణి ఉన్నారు. వెంకటాయపాలెం, చిట్యాల గ్రామాల్లో తడిసిన ధాన్యపురాసులను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకట్రాజు పరిశీలించారు. వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. దేవరపల్లి మండలంలో కురిసిన వర్షానికి ధాన్యం రాసులు, మొక్కజొన్న కండెలు తడిచిపోయాయి. అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయని రైతులు తెలిపారు. రైతులను వెంటనే ఆదుకోవాలని లేకుంటే నిరవధిక దీక్షకు దిగుతామని టిడిపి గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. గౌరీపట్నంలో వర్షం వల్ల తడిసిన ధాన్యంను ఆయన పరిశీలించారు. తాళ్లపూడి మండలంలో 33.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటలు తడిచిపోయాయి. అకాల వర్షం కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టామని ఎఒ రుచిత తెలిపారు.