Jan 28,2023 22:36

శంకుస్థాపన చేస్తున్న కలెక్టర్‌ కె.మాధవీలత

ప్రజాశక్తి - కొవ్వూరు
నవరత్నాలు పేదలకు ఇళ్లు పథకంలో జిల్లాలో ఇప్పటి వరకూ 14,223 ఇళ్లు పూర్తి అయ్యాయని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. శనివారం కొవ్వూరు అర్బన్‌లోని జగనన్న లే అవుట్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి రమాదేవి, రాజు దంపతుల ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 56,771 ఇళ్లు మంజూరు కాగా 53,949 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక చేయూతతో పాటుగా ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, నీటి వనరులు సమకూరుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు విద్యుత్‌ సరఫరా కూడా అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు అవసరమైతే అదనపు బ్యాంకు రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను, బ్యాంకర్లను ఆదేశించామని తెలిపారు.
కొవ్వూరు అర్బన్‌లో 2,830 మందికి ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 198 మంది మాత్రమే పూర్తి చేసుకున్నారన్నారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. లే అవుట్లలో తాగునీటి సదుపాయం కల్పించాలని, పైపు లైన్లు లీక్‌ కాకుండా మరమ్మతులు చేయించాలని మున్సిపల్‌ కమిషనర్‌ బి.శ్రీకాంత్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం లబ్ధిదారు వేండ్ర సునీత ఇంటిని కలెక్టర్‌ పరిశీలించారు. ఇంటిని నిర్మించుకున్నా ఇంకా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నీటి వసతి లేని కారణంగా రావట్లేదని ఆమె కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై కలెక్టర్‌ స్పతించారు. ప్రతి రోజూ ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఇళ్లలోకి రావాలని, దీని కోసం అన్ని విధాలా అధికారులు సహకారం ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ భావన రత్నకుమారి, ఇన్‌చార్జి జిల్లా హౌసింగ్‌ అధికారి జి.పరశురామ్‌, ఆర్‌డిఒ ఎస్‌.మల్లిబాబు, ఎపిఇపిడిసిఎల్‌ ఇంజినీర్‌ పి.అచ్యుతాచారి, హౌసింగ్‌ డిఇ ఎం. శ్రీనివాసరావు, తహశీల్దార్‌ బి.నాగరాజునాయక్‌, కౌన్సిలర్లు, మున్సిపల్‌, పంచాయతీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు