బ్యాంకు ఖాతలకు రూ.101.90 కోట్ల జమ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిల్లా వ్యాప్తంగా 1,35,867 మంది రైతులకు 2023-24 ఏడాదికి చెందిన తొలి విడత రైతు భరోసా సొమ్ము రూ.102 కోట్లు, ఇన్‌పుట్ సబ్సీడీ కింద 1,052 మందికి రూ.1.02 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారని జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్.శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి రాష్ట్ర స్థాయి రైతు భరోసా, పిఎం కిసాన్ యోజన పథకం నగదు బదలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ధవళేశ్వరం లోని పునరావాస కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, కలెక్టరు మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడారు. రైతుల పక్షపాతిగా సిఎం జగన్ అండగా ఉన్నారన్నారు. రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారన్నారు. రైతు భరోసాలో భాగంగా 2023-24 సంవత్సరానికి తొలి విడతగా రూ.7,500 లను రైతుల ఖాతాలకు జమచేశారన్నారు. హోం మంత్రి వనిత మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వ్యవసాయం పండుగలా చేస్తూ భరోసాను కల్పించారన్నారు. ఇటీవల జరిగిన పంట నష్టానికి సంబందించి ఇన్ ఫుట్ సబ్సిడీని 60 రోజుల్లోనే రైతులకు జమ చేసిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ, హార్టికల్చర్ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ రంగంలోని 577 మంది రైతులకు చెందిన 331.34 హెక్టర్ల పంట నష్టం కింద రూ.46.83 లక్షలు, హార్టికల్చర్ రైతాంగానికి చెందిన 475 హెక్టార్ల పంట నష్టం కింద రూ.55.37 లక్షలు నేడు జమ చేశారన్నారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ నియోజక వర్గాల వారీగా జమ చేసిన రైతు భరోసా - పిఎం కిసాన్ యోజన వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, సభ్యులు కె.తేజ, జెసి ఎన్.తేజ్‌భరత్, సహాయ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, హార్టికల్చర్ అధికారి వి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










