సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
నాలుగు నెలలుగా జీతాలు లేకుండా ఎలా బతకాలలి అని, స్కూల్ ఆయాల సమస్యలను మున్సిపల్, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవట్లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ అన్నారు. డిఇఒ కార్యాలయం వద్ద ఆయాలు చేపట్టిన నిరసన గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని నినదించారు. ఈ సందర్భంగా ఆయాలను ఉద్దేశించి రాజులోవ మాట్లాడారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ స్కూల్స్‌ను ప్రభుత్వం విద్యాశాఖకు బదిలీ చేసిందన్నారు. అయితే అందులో పని చేసే పార్ట్ టైం కంటింజెంట్ వర్కర్లు (అయాలు) విషయంలో సరైన గైడ్‌లెన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు. దీంతో నాలుగు నెలలుగా వేతనాలు అందలేదన్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపల్, విద్యా శాఖ అధికారులకు ఆయాల సమస్యలు పట్టట్లేదన్నారు. మున్సిపల్ శాఖ అధికారులు తమ బాధ్యత లేదన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. వారు మార్చి వరకు జీతాలిచ్చి చేతులు దులుపుకున్నరన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, కలెక్టర్ ఈ సమస్యపై స్పందించా లన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో స్కూల్ స్వీపర్స్ యూనియన్ నాయకులు వై.ఝాన్సీ, తాయారు, సత్యవతి, శాంతి, తదితరులు పాల్గొన్నారు.










