ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : 10వ తేదీ వచ్చినప్పటికీ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించక పోవడాన్ని నిరసిస్తూ యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో ఉపాధ్యాయులు చీపుర్లతో నిరసన తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్‌రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడాన్ని ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నామని అన్నారు. మూడు నెలలుగా కెజిబివి సిబ్బంది తోపాటు, సర్వ శిక్ష అభియాన్ సిబ్బంది జీతాలు చెల్లించలేదని, ఇన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోతే ఆయా కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు తోట రమేష్ మాట్లాడుతూ రెండేళ్లగా పాలనాపరమైన గ్రాంట్స్ విడుదల చేయకపోవడం వలన సంబంధిత ప్రధానోపాధ్యాయులు తమ సొంత నిధుల నుండి ఖర్చులు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని, దసరా సెలవులను దృష్టిలో పెట్టుకొని ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరారు. అనంతరం డిఇఒకు వినతి అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కోశాధికారి కె.మురళి, కార్యదర్శి ఎన్.శ్రీను, ఎం.పైడిరాజు, కె.భాస్కరరావు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.










