Aug 19,2023 23:57

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖ కార్యాలయం రాజమహేంద్రవరం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. బదిలీ మరియు ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు.
నిరసన ప్రదర్శనను ఉద్దేశించి ఫ్యాప్టో చైర్మన్‌ పి.జయకర్‌ మాట్లాడుతూ బదిలీ,ప్రమోషన్లు అయిన ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలని, ప్రస్తుతం అమలు చేస్తున్న పని సర్దుబాటు ప్రక్రియను నిలుపుదల చేయాలని, జిఒ 117 ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు .ఫ్యాప్టో సభ్యులు డేనియల్‌ బాబు మాట్లాడుతూ బదిలీలు పదోన్నతులు నిర్వహించి ఇప్పటికీ మూడు నెలలు గడిచినా ఉపాధ్యాయులకు జీతం చెల్లించకుండా వేధించడం పాఠశాల పని సర్దుబాటు పేరుతో మరల ఉపాధ్యాయుని ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వానికి తగదన్నారు.
దుర్గారావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల స్థాయిలో వర్క్‌ బుక్కులు పెంచి విద్యార్థులపై ఉపాధ్యాయులపై ఒత్తిడిని పెట్టడం తప్ప విద్య ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంత మాత్రం ఉపకరించవన్నారు.
ఎ.షరీఫ్‌ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో సిబిఎస్‌సి సిలబస్‌ను అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంతలోనే ఐ.బి సిలబస్‌ ను ప్రవేశపెడతామని చెప్పడం, విద్యావ్యవస్థను గందరగోళంలో పడేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆగస్టు 23న రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం, ఇబ్రహీంపట్నం వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఫ్యాప్టో కోచైర్మన్‌ నరహరి, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ శేష బ్రహ్మం, కోశాధికారి జెడి ఇసాక్‌ డేనియల్‌ బాబు, కో ఛైర్మన్లు డి.దుర్గారావు, శ్రీనివాసరావు, సభ్యులు ఎన్‌, అరుణ్‌ కుమారి, ఎన్‌.రవిబాబు, కె.రమేష్‌, ఎం.రవి, ఐ.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.