ప్రజాశక్తి - గోపాలపురం
జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో అప్పుల బాధ తాళలేక 1,800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకట్రజు ఆరోపించారు. శనివారం మండలంలోని రాజంపాలెంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కాకర్ల రామతులసి నివాసం వద్ద నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు నానా ఇబ్బందులు పడ్డార్నారు. వారి ఆవేదనను చంద్రబాబు నేరుగా తెలుసుకున్నారన్నారు. యువగలం పేరుతో లోకేష్ నేరుగా పాదయాత్రలో రైతుల సమస్యలు తెలుసుకుని ఎంతో చలించిపోయారన్నారు. వైసిపి నాలుగేళ్ల పాలనలో రైతులు పండించిన పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడ్డారన్నారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకూ రైతులు నష్టపోయారన్నారు. గిట్టుబాటు ధర లేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.2.45 లక్షల అప్పు ఉందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అన్నదాత పథకం ద్వారా ఇలాంటి రైతుల కుటుంబాలను ఆదుకుంటుందన్నారు. ఏడాదికి రూ.20 వేల చొప్పున ఐదేళ్లకు రూ.లక్షను రైతుల ఖాతాలకు ఈ పథకంలో భాగంగా జమేస్తారాన్నరు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పోతా రాజబాబు, కోడూరి రఘురాం, కాకర్ల జగదీష్, యద్దనపూడి బ్రహ్మ రాజు, పరిమి జగదీష్, ఇల్లూరి రాంబాబు, వెల్లంకి జయ సూర్య , ముప్పిడి అనిల్, సందీప్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.










