ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఆర్ధిక నేరస్తుడు జగన్ రెడ్డి పాలన సాగిస్తున్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, అందుకే ప్రజా ఉద్యమాలను ఉక్కు పాదంతో అణిచివేయ బడుతున్నాయని అఖిలపక్షం మండిపడింది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నగరంలో అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన పార్టీ అర్బన్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర జనసేన అధ్యక్షుడు వై.శ్రీను, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, సిపిఎం జిల్లా నాయకులు ఎస్‌ఎస్ మూర్తి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ రావు, ఇతర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడారు. సిఎం జగన్ అరాచక పాలనను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజావేదిక కూల్చివేతలో ప్రారంభం అయిన జగన్ నియంతృత్వ పరిపాలన మాజీ సిఎం చంద్రబాబు అరెస్టుతో పరా కాష్టకు చేరిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులకు పాల్పడటం, గృహా నిర్భాందానికి గురిచేయడం, లాఠీలతో కొట్టించడం, వైసిపి గూం డాలతో దాడులు చేయించడం పరిపాటిగా మారాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం చాలా దారు ణమని అన్నారు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం సిబిసిఐడి పని చేస్తుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికై నియంతల పరిపాలన చేస్తున్నారని దుయ్య బట్టారు. ఈ రాష్ట్రంలో వైసిపిని ఓడించడం ద్వారానే రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవచ్చన్నారు. జగన్ లాంటి నియంతకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్ర బాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయకపోతే రాష్ట్రంలో ప్రజా ఉద్యమం తప్పదని వారు హెచ్చరిం చారు. పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ వైసిపి ప్రభు త్వం సిఐడిని జేబు సంస్థగా మార్చేసిందని ఆరోపించారు. జైల్లో ఉన్న చంద్రబాబును ఆయన సతీమణి ములాఖత్‌కు దరఖాస్తు చేసుకుంటే నిబంధనలు వర్తిం చవని చెబుతున్న జైలు అధికారులు దళిత యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసిపి ఎంఎల్‌సి అనంతబాబుకు వర్తించని జైలు నిబంధనలు ఓ మాజీ ముఖ్యమంత్రికే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టిడిపి నగర అధ్యక్షుడు రెడ్డి మణి, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, ప్రజాసంఘాల నాయకులు వైరాల అప్పారావు, రాచపల్లి ప్రసాద్, ద్వారా పార్వతి సుందరి, నల్లా రామారావు, యడ్ల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.










