ప్రజాశక్తి-గోపాలపురం గోపాలపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు మరుగుదొడ్లు లేక, తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైస్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 730 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. బాలికలు 344 మంది ఉండగా, బాలురు 386 మంది ఉన్నారు. వీరికి మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మరుగుదొడ్ల కొరత, ఉన్న మరుగుదొడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉండడంతో బాలికలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైస్కూల్ కాంపౌండ్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలు కూడా వీటినే వినియోగించడంతో తగిన వసతులు లేక తీవ్ర అవస్థలు గురవుతున్నారు. అనేక సంవత్సరాల నుంచి బాలురకు మరుగుదొడ్లు వసతులు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో వారు చెరువుల వద్దకు, పొలాలలోకు వెళ్లి కాలకత్యాలు తీర్చుకుంటున్నారని ఆవేదన చెందారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాల కత్యాలు తీర్చుకునేందుకు చెరువులను, పొలాలను ఆశ్రయిస్తున్నామని వారు చెబుతున్నారు. బాలుర్లకు మరుగుదొడ్లు లేకపోవడంపై చాలా తీవ్ర సమస్య ఎప్పటినుండో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అగ్రహం వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో చెరువుల వద్దకు లేక దూర ప్రాంతాలకు పొలాలలోకి వెళ్లి సమస్యను పరిష్కరించుకుంటున్నామని అన్నారు. విద్యార్థులకు మరుగుదొడ్లు లేకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాతల సహాయంతో 2017లో హైస్కూల్‌కు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అయితే మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా విద్యార్థులకు మంచినీరు అందించిన దాఖలాలే లేవని తల్లిదండ్రులు అంటున్నారు. ప్లాంట్ అసలు వినియోగంలోనే లేదని చెబుతున్నారు. సత్య సాయి బాబా మంచినీరు హైస్కూల్‌కు వచ్చేదని, అది కూడా సుమారు అనేక ఏడాదిన్నర నుంచి రావడం లేదంటున్నారు. దీంతో పంచాయతీ నీళ్లనే తాగుతున్నారు. ఆ నీరు తాగడం ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయని ఆవేదన చెందారు. కొంతమంది విద్యార్థిని విద్యార్థులు ఇంటి వద్ద నుండి వాటర్ బాటిల్‌లు తెచ్చుకుంటున్నప్పటికీ అని సరిపోకపోవడంతో పంచాయతీ నీరునే తాగుతున్నామని చెప్పారు. పాఠశాల ఆవరణలో 2020లో రూ.కోటీ 20 లక్షల నాబార్డు నిధులతో ఆరు తరగతి గదులు కట్టేందుకు పనులు మొదలు పెట్టారు. కొత్త తరగతి గదులు నిర్మించేందుకు పాడుబడిన తరగతు గదులను తొలగించారు. తగినన్ని తరగతి గదులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నేటికీ ఆ తరగతి గదుల నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతో ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న ఆ గదుల్లోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. సుమారు 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నాబార్డు ద్వారా నిధులు సక్రమంగా రాకపోవడంతో పనులు నత్తనడకు నడుస్తున్నాయంటున్నారు. అదనపు తరగతి గదులతో పాటు బాలికలకు 10 టాయిలెట్స్ కడుతున్నట్లు తెలిపారు. నాబార్డ్ నిధులతో కడుతున్న బాలికల టాయిలెట్స్ పూర్తి చేస్తే బాలికలకు కొంతమేర సమస్య తీరుతుంది. బాలురులకు కూడా టాయిలెట్స్ కట్టాలని కోరుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్‌ను పునరుద్ధరించి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని, అదనపు తరగతి గదులు నిర్మాణం పనులు పూర్తి చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరారు.










