Feb 04,2023 23:34

ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాదమూర్తి పాల్గొని మాట్లాడుతూ తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉందన్నారు. ఈ మూడు రోజుల సదస్సులో భాషలోని వివిధ కోణాలను, సాహిత్య, చారిత్రక, సామాజిక నేపథ్యాలను వక్తలు, పరిశోధకులు వివరించారని తెలిపారు. తెలుగు భాష ఔనత్యాన్ని పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు ఎంతో దోహదపడతాయన్నారు. ఒఎస్‌డి ఆచార్య ఎస్‌.టేకి, జాతీయ సదస్సు సంచాకుడు ఆచార్య మాడభూషి సంపత్‌ కుమార్‌, కన్వీనర్‌ డాక్టర్‌ తరపట్ల సత్యనారాయణ, ఆచార్య సి.వి.శివరామకృష్ణ ప్రసంగించారు. కన్వీనర్‌ తరపట్ల సత్యనారాయణ రచించిన యజ్ఞ అనే వాస్తవిక వచన కవిత్వం కన్నడంలో డాక్టర్‌ ఎ.మునిరాజా అనువదించిన పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరింంచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కెవిఎన్‌డి.వరప్రసాద్‌, డాక్టర్‌ పివిబి.సంజీవరావు, బి.వెంకటేశ్వర్లు, నూజిళ్ల శ్రీనివాసరావు, డాక్టర్‌ ఎస్‌.సుధారాణి పాల్గొన్నారు.