Apr 03,2023 23:23

ప్రజాశక్తి-గోపాలపురం చేపల వేటలో నైపుణ్యం కలిగిన జాలర్లకు మత్స్య శాఖ నుంచి గుర్తింపు కార్డు పొందాలని మత్స్య శాఖ ఎడి బి.సైదానాయక్‌, సర్పంచ్‌ అన్నెపు వెంకటలక్ష్మి తెలిపారు. సోమవారం భీమోలు గ్రామంలో నైపుణ్యం కలిగిన గిరిజన యానాదులకు సర్పంచ్‌ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మత్స్య శాఖ ఎడి సైదా నాయక్‌ జాలర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు, కాలువలోకి వెళ్లి చేపలు పట్టుకుని జీవనోపాధి పొందే వారు ఏ సామాజిక వర్గమైనప్పటికీ చేపల వేటలో నైపుణ్యం కలిగి దానిమీద జీవనోపాధి పొందుతున్న జాలర్లకు గుర్తింపు కార్డు ఉండటంవల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీములకు ఈ గుర్తింపు కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 50 ఏళ్లు దాటిన మత్స్యకారులకు పెన్షన్‌ పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుందన్నారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు ఈ కార్డులు పొందవచ్చన్నారు. గ్రామ సచివాలయాల్లో ఉండే మత్స్యశాఖ సిబ్బంది వద్ద దరఖాస్తు చేసుకుని పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దుంపల రాంపండు, బండారు దొరబాబు పాల్గొన్నారు.