- తహశీల్దార్ గా పనిచేసిన సురేష్ బాబు, సబ్ ఇన్సెస్పెక్టర్ వెంకటరత్నంపైనా విచారణ జరపాలి
- ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: పోలవరం భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. దేవీపట్నం తహశీల్దార్ గా పనిచేసిన కె.సురేష్ బాబును ఇండియా రప్పించి విచారణ జరిపించాలని, అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటరత్నంపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవీపట్నం మండలంలో భూమి రికార్డులను వెబ్ ల్యాండ్లో అక్రమంగా మార్చేసిన వ్యవహారంలో తహశీల్దార్ కె.సురేష్ బాబుపై ఎఫ్.ఐ.ఆర్. నెం.7 గా 2019 ఫిబ్రవరి 8న కేసు నమోదయ్యిందన్నారు. ఐ.పి.సి.సెక్షన్ 420, 468, 466477(ఎ) ప్రకారం ఆయనపై కేసు నమోదయ్యింది కాని ఐ.పి.సి. 409 సెక్షన్ నమోదు చేయవలసి వుందన్నారు.. అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం నిందితుడిని రక్షించి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వీలుగా ఉద్దేశ్య పూర్వకంగా ఐ.పి.సి. 409 సెక్షన్ నమోదు చేయలేదని ఆరోపించారు. ఈ విషయమై ఎస్.ఐ. వెంకటరత్నం తీరుపై ప్రభుత్వం విచారణ జరపవలసివుందన్నారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంపచోడవరం ఎ.యస్.పి. రాహుల్ దేవ్ సింగ్ ఆదేశాలపై దేవీపట్నం యస్.ఐ. ఈ కేసు నమోదు చేశారని సూర్య నారాయణ వివరించారు. పోలవరం ప్రాజెక్టు కింద భూసేకరణ, నిర్వాసితులకు భూమికి భూమి కోసం గిరిజనేతరుల భూముల సేకరణకు అనర్హులకు అక్రమ లబ్ధిని చేకూర్చడం కోసం దేవీపట్నం మండలంలోని భూమి రికార్డులను అప్పటి తహశీల్దార్ సురేష్ బాబు ఇష్టారాజ్యాంగా మార్చేశారని మండిపడ్డారు. ఈ మండలంలో 13 గ్రామాలలో సర్వే నెంబర్లుకు సంబంధించి 1285 ఎంట్రీలను అక్రమంగా వెబ్ ల్యాండ్లో మార్చివేశారని తెలిపారు. 2017లో సురేష్ బాబు పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో కేవలం ముందు నెలలోనే ఎంట్రీలన్నీ మార్చివేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారాయని ఆరోపించారు. గిరిజనులకు చెందిన భూములను గిరిజనేతరుల పేరుకు మార్చడం, ఇతర గిరిజనేతరుల పేరున వున్న భూములను వేరే గిరిజనేతరులకు మార్చి అక్రమాలకు తెరలేపారని దీనివల్ల అనర్హులు చాలామంది లబ్ధిపొందారని సూర్యనారాయణ తెలిపారు. లేని భూములు వున్నట్లుగా రికార్డులు సృష్టించారు. దీని ఫలితంగా వేలాది ఎకరాలలో అనర్హులకు భూసేకరణాధికారులు పరిహారం చెల్లించారని పేర్కొన్నారు. దేవీపట్నం మండలంలోని దేవీపట్నం, పెదభీంపల్లి, రావిలంక, లోతుపాలెం, ఇందుకూరు, పెద్దనూతుల, ఇందుకూరుపేట, మంటూరు, దేవారం, శరభవరం, కొండమొదలు, దండంగి, తొయ్యేరు గ్రామాలలో 320 సర్వే నెంబర్లలో ఈ అక్రమాలు జరిగాయని తెలిపారు. వీటిపై రంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్ కుమార్ విచారణ చేసి ఈ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదించారని గుర్తు చేశారు. 2017 ఆగష్టు నెలలో పదవీ విరమణ చేసిన సురేష్ బాబుపై చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అప్పటి జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా ఆదేశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రస్తుతం విదేశాలలో నివసిస్తున్న కె.సురేష్ బాబును ప్రభుత్వం భారత దేశానికి రప్పించి కేసు విచారణ జరిపించాలని ఆదివాసీ మహాసభ, అఖిల భారత ట్రైబల్ మంచ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయని సూర్య నారాయణ చెప్పారు. విలేకర్ల సమావేశంలో అఖిల భారత ట్రైబల్ మంచ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్ యలగాడ నాగేశ్వరరావు, ఆదివాసీ మహాసభ నాయకులు అరగంటి వీరభద్రారెడ్డి,జక్కల పాండవులు,మడకం సముద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.










