ప్రజాశక్తి - యంత్రాంగం తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని రాజమండ్రి, కొవ్వూరు డివిజన్‌లో ఏర్పాటు చేసిన 47 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలకు 15,481 మంది (98.03 శాతం), వొకేషనల్ పరీక్షలకు 1700 మంది (88.31శాతం) హాజరయ్యారని ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి ఎన్‌ఎస్‌వి.ఎల్ నరసింహం తెలిపారు. రాజమండ్రి డివిజన్ లోని 32 కేంద్రాల్లో తెలుగు పరీక్షకు 11,728 మందికి గాను 11,517 మంది హాజరవగా, 211 మంది గైరాజరయ్యారని, కొవ్వూరు డివిజన్‌లోని 15 కేంద్రాల్లో 4,057 మందికి గాను 3,964 మంది హాజరవగా 93 మంది గైర్హాజరయ్యారన్నారు. ధవళేశ్వరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 37,288 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియేట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్ష తరగతిలో పరీక్షలు సజావుగా రాసేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి కాలం దష్ట్యా ప్రతి కేంద్రంలో మెడికల్ క్యాంపు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను, తరగతి గదిలో తాగునీటి వసతిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతి తరగతి గదిలో సిసి కెమేరా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు మాధవీలత తెలిపారు. కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షల నిర్వహణ విధానాన్ని పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ఆర్టీసి , రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రతి పరీక్షా కేంద్రానికీ బస్సు, ఆటోలతో కూడిన రవాణా ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ మంది ఒక చోట నుంచి వచ్చే వారికి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు వివరాలు తెలియ చేస్తే పరీక్ష సమయాల్లో ఆయా రూట్లలో రవాణా సదుపాయం అందుబాటులోకి తీసుకుని వస్తామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. కలెక్టర్ వెంట ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి (ఆర్‌ఐఒ) ఎన్‌ఎస్‌వి.ఎల్ నరసింహం ఉన్నారు. తాళ్లపూడి మండల పరిధిలోని వేగేశ్వరపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి రోజు పరీక్షకు 22 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 221 మందికిగాను 199 మంది హాజరయ్యారు. ఎస్‌ఐ కెవి రమణ పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించారు. పరీక్షా కేంద్రం చీప్ పి.గౌరీనాథ్, డిఒ కెవి.రమణమూర్తి పర్యవేక్షించారు. కోరుకొండ మండలంలో ఏకైక పరీక్షా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిసి కెమేరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చీఫ్ సూపరింటెండెంట్ రామచంద్రరావు తెలిపారు. మొత్తం 497 మంది విద్యార్థులకుగాను 473 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 24 మంది గైర్హాజరయ్యారు. డిఎస్‌పి కడలి వెంకటేశ్వరరావు పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. గోకవరంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, బిఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు కేంద్రాల్లో 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. గోపాలపురంలో పరీక్షలకు 27 మంది గైర్హాజరైనట్టు నిర్వహణాధికారి యువి.రమణ, టి.ఉమాదేవి తెలిపారు.










