నిమిషం ఆలష్యమైనా అనుమతి నిరాకరణ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 140 కేంద్రాల ఏర్పాటు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్‌జెడి ఐ.శారద, ఆర్‌ఐఒ ఎన్‌ఎస్‌విఎల్.నరసింహారావు తెలిపారు. సోమవారం రీజనల్ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారి కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వారు మీడియాకు వివరించారు. ఆర్‌జెడి శారద మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి డివిజన్ 35 కేంద్రాల్లో 26,931 మంది, కాకినాడ జిల్లాలో 60 కేంద్రాల్లో 41,817మంది, డా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 38 కేంద్రాల్లో 28,973 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 కేంద్రాల్లో 4,922 మంది మొత్తం 140 కేంద్రాల్లో 1,02,643 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్నారని తెలిపారు. కొవ్వూరు డివిజన్‌లో 12 కేంద్రాల్లో 10,357 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. విద్యార్థి హల్ టికెట్ నిలుపుదల చేస్తే అటువంటి కాలేజీ యాజమాన్యంపై చట్టవరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు హాల్ టికెట్స్‌ను వెంటనే అందజేయాలన్నారు. హాల్ టికెట్స్ ఇంకా ఎవరైనా తీసుకోని విద్యార్థులు ఉంటే వెంటనే ఆయా కళాశాల ప్రిన్సిపల్ నుంచి పొందాలన్నారు. పరీక్షలు మొత్తం సిసి కెమెరాల్లో చిత్రీకరిస్తామన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి నరసింహరావు మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల్లో సిఎస్, డిఒలను నియమించామన్నారు. జిల్లాలో ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 10 సిటింగ్ స్క్వాడ్స్‌ను నియమించామన్నారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటలు వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరే విధంగా చూసుకోవాలన్నారు. జిల్లాలో 13 సెన్సిటీవ్ కేంద్రాలను గుర్తించామన్నారు. జిల్లాలో 53 పోలీసు స్టేషన్లలో ప్రశ్న పత్రాలు భద్ర పరిచామని, పరీక్ష ప్రారంభం అయ్యే అరగంట ముందు మాత్రమే పరీక్ష కేంద్రానికి వాటిని తరలిస్తామన్నారు. ప్రధాన పరీక్ష పర్యవేక్షణ చేసే అధికారికి బేసిక్ ఫోన్ ఇంటర్మీడియట్ శాఖ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సమయానికి ఉదయం, మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు వైద్యులు వైద్య సిబ్బందితో పాటు 108 వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. తాగునీరు, తగినన్ని ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేశామన్నారు. పరీక్ష జరిగే రోజుల్లో కేంద్రాల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.










