గుదిబండగా గ్యాస్‌బండ
సలసలా కాగుతున్న వంట నూనెలు
పెనుభారంగా పెట్రో, విద్యుత్ ఛార్జీలు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
దిగువ మద్యతరగతి కుటుంబాల ఇంటి బడ్జెట్ తలకిందులైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే నిత్యావసరాల కోసం నెలవారీ బడ్జెట్ రూ.15వేల నుంచి రూ.18వేలకు చేరింది. గతేడాదితో పోల్చితే ధరలు పెరగటమే తాజా పరిస్థితికి కారణం. అయితే ఆ స్థాయిలో ఆదాయాలు లేకపోవడంతో ప్రతిఒక్కరిలోనూ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మార్కెట్లలో పెరుగుతున్న నిత్యావసర సరుకులు, పెట్రో, గ్యాస్ ధరలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండు నెలల కాలంలో పలు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెలు, విద్యుత్ ఛార్జీలు సామాన్యులపై దండెత్తుతున్నాయి. పెరుగుతున్న ధరల దాడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధరల నియంత్రణపై చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
గతంలో ఎన్నడూలేని విధంగా నూనెల ధరలు ఆకాంశనంటుతున్నాయి. కిలో సన్‌ఫ్లవర్ నూనె రూ. 145 నుంచి రూ. 150 ఉన్న ధర ప్రస్తుతం రూ. 195 నుంచి రూ. 200 వరకు చేరింది. పామాయిల్ ధర రూ. 120 ఉండగా ప్రస్తుతం రూ. 160 వరకు పలుకుతోంది. పల్లి నూనె ధర రూ.180 నుంచి రూ. 230 వరకు చేరింది. ఇలా పలు నూనెల ధరలు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా భావించిన పలువురు వ్యాపారులు నో స్టాక్ పేరిట అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. లీటరు పెట్రోలు రూ.111.30 పైసలుండగా, డీజిల్ రూ.98కి చేరింది. కేంద్ర, రాష్ట్ర పన్నులమోతతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇందనం ధరల పెంపు అన్ని రంగాలపై పడుతోంది. రవాణా ఛార్జీలు పరగడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై భారాలు తప్పడం లేదు.
నిత్యావసరాలు అదే బాటలో...
గత నెలలో పచ్చిమిర్చి కిలో రూ.30 ఉండగా, ప్రస్తుతం రూ.45కు చేరింది. కిలో కంది పప్పు రూ.110 నుంచి రూ.130 వరకు, మినుములు రూ. 100 నుంచి రూ. 140, పెసరపప్పు రూ.100 నుంచి రూ.120, చక్కెర రూ.35 నుంచి రూ.45 వరకు, గోదుమలు రూ. 50 నుంచి రూ. 65 వరకు పెరిగాయి. మరో వైపు గ్యాస్ ధరలు నెలవారీగా పెంచుతుండడంతో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాది14 కేజీల సిలిండర్ ధర రూ.930 నుంచి దశల వారీగా పెరుగుతూ తాజాగా రూ.1210కి చేరింది. గ్యాస్ ధర పెంపుతో నెలకు జిల్లా ప్రజలపై రూ. అరకోటి మేరకు అదనపు భారం పడుతోంది. తాజాగా విద్యుత్ ఛార్జీలు సైతం సర్ చార్జీల పేరుతో మోత మోగుతున్నాయి. యూనిట్ ధర పెరగడంతో ఏప్రిల్ ఒకటవ తేది నుంచి విద్యుత్ బిల్లులు భారం అదనంగా మారింది. గహావసరాల విద్యుత్ చార్జీ రూ. 0.40 పైసలు నుంచి రూ. 0.50 పైసల వరకు పెరిగింది. కమర్షియల్, పరిశ్రమలు, వీది దీపాలు, వాటర్ వర్క్స్ తదితర వాటికి రూ. 1 నుంచి రూ. 1.50 పైసల వరకు పెరిగింది.
పెరిగిన ఇంటి బడ్జెట్
మా ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటున్నాం. నిత్యావసర సరుకుల కొనుగోలుకు కనీసంగా రూ.8వేలు వెచ్చించక తప్పడం లేదు. టు వీలర్ పెట్రోల్ బిల్లు నెలకు రూ.3వేల చేరింది. విద్యుత్, పాల బిల్లు కలిపి మరో రూ.3వేలు అవుతోంది. ఇంటి పన్నులు పెరగటంతో ఇంటి అద్దె పెంచేశారు. గతంలో రూ.4,500 ఇప్పుడు రూ.5వేలు చెలించాల్సి వసుంది. జీతం చాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆరోగ్య అవసరాలకు చేతిలో చిల్లిగవ్వ ఉండట్లేదు.
- వి. రాజేష్ సుబ్బారావు పేట రాజమహేంద్రవరం
ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలి
పాలక ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే ప్రచారం విస్తృతంగా చేస్తున్నాయి. మరో వైపు దొడ్డిదారిన పన్నులు, ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నాయి. ప్రతి కుటుంబంలో భార్యభర్తలు ఇద్దరూ కష్టపడినా కుటుంబ ఖర్చుల కోసం ఇబ్బందులు తప్పటం లేదు. పాలక ప్రభుత్వాలు చొరవ చూపాలి ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలి. లేని పక్షంలో రాబోయే ఎన్నికలలో ప్రజలు సరైన సమాధానం చెప్తారు.
- కె. రామలక్ష్మి ఆర్యాపురం, రాజమహేంద్రవరం










