Feb 20,2023 15:29

ప్రజాశక్తి - సీతానగరం : సీతానగరం మండలంలో అఖండ గోదావరి నదీ గర్భంలో నియమనిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు పై ప్రధాన మంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. సీతానగరం మండలం చినకొండేపూడికి చెందిన సామాజిక ఉద్యమకారుడు చిడిపి నకుల సురేష్ గత కొంత కాలంగా అక్రమ భూగర్భ తవ్వకాలు పై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పత్రికా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ అదేశాలకు వ్యతిరేకంగా భారీ యంత్రాలతో, లారీలతో రాత్రి పగలు తేడా లేకుండా యదేచ్ఛగా ఇసుక త్రవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. ఈ అక్రమ ఇసుక త్రవ్వకాలపై పలుమార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గనులు మరియు భూ గర్భ శాఖ అధికారులకు అఖండ గోదావరి నదీ గర్భంలో అక్రమ ఇసుక త్రవ్వకాల పై రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్ధాయి అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అక్రమ తవ్వకాలపై ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదన్నారు. భారత రాజ్యాంగం అర్టికల్ 51ఎ ప్రకారం పర్యావరణాన్ని రక్షించడం భారతీయ పౌరులందరి ప్రాథమిక బాధ్యత. నదీ గర్భంలో అక్రమ ఇసుక త్రవ్వకాల వలన పర్యావరణానికి, నదీ ప్రవాహానికి ఎంతో ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. లంక భూములు కోతకు గురవుతున్నాయి. రైతులు ఎంతో విలువైన తమ భూములను కోల్పోవడమే కాకుండా వారి జీవనాధారాన్ని కొల్పోతున్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగం ఎవరూ అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో గోదావరి నదీ గర్భంలో నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను నిలిపివేయాలని కోరుతూ, తగు చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన మంత్రికి సవినయంగా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.