ప్రజాశక్తి-పెరవలి మండలంలోని అన్నవరప్పాడులో దళితులకు జగనన్న ఇళ్ల స్థలాల మంజూరు చేయలేదని దళితులు, మహిళలు ఎపి ఎంఆర్‌పిఎస్, బిఎస్‌పి, జనసేన పార్టీ ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దారు టి.రాజేశ్వరికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే దళితులకు ఇంటి స్థలాల పంపకంలో చిన్న చూపు చూశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 180 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు కాగా దళితులు బడుగు బలహీన వర్గాలకు 29 స్థలాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. దళితులకు ఇళ్ల స్థలాలు శ్మశాన వాటిక సమీపంలో ఇచ్చారని, అగ్రవర్ణాలకు జాతీయ రహదారి పక్కన స్థలాలు ఇచ్చి దళితులపై వివక్ష చూపారని చెప్పారు. గ్రామ పరిధిలో మూడు ప్రాంతాల్లో మూడు చోట్ల గ్రామ కంఠం ఉండగా దళితులు మాత్రం ఉండే ప్రాంతంలో గ్రామ కంఠాన్ని స్వాధీనం చేసుకుని జగనన్న లేఔట్ చేసి ఇంటి స్థలాలు ఇవ్వటానికి 1 1/2 సెంట్లకు రూ.70 వేలు తీసుకుని అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. ఈ భూమి దళితులు బహిర్భూమి ఉపయోగించు కుంటున్నారన్నారు. ఆక్రమణగా ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారని తెలిపారు. ఈ భూమిని స్థానికంగా ఉండే దళితులకు ఉపయోగపడే విధంగా రెవెన్యూ అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ భూమిలో స్థానికంగా ఉన్న దళితులు కమ్యూనిటీ హాల్ నిర్మించుకునే విధంగా దళితులకు కేటాయించాలని నాయకులు కోరారు. స్థానికంగా జాతీయ రహదారి పక్కన ఉన్న జగనన్న లే అవుట్స్‌లో మిగిలి ఉన్న 20 ఇంటి స్థలాలు తక్షణం దళితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొంతమంది దళితులు డబ్బులు కట్టిన ఇప్పటి వరకు ఇంటి స్థలాలు కేటాయించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి చెట్టే సుజనరావు, బిఎస్‌పి నాయకులు చిర్ర రాజు, జనసేన నేత పిప్పర రవి, స్థానికులు పంతం కృపాకరరావు, కోటిపల్లి నరసింహమూర్తి, రాయ సువార్త, చిన్నారి, వసంత లక్ష్మి, బి.జాన్, పిఎస్. వీరాస్వామి, సిహెచ్.మూర్తి డి.బాబీ పాల్గొన్నారు.










