ప్రజాశక్తి - గోపాలపురం
ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరు త్వరితగతన నిర్మాణ పనులు చేపట్టాలని ఎంపిడిఒ ఆర్.శ్రీదేవి లబ్ధిదారులకు సూచించారు. శనివారం వేళ్లచింతలగూడెంలో సర్పంచ్ గోళ్ల దండియా అధ్యక్షతన లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హౌసింగ్ ఎఇ ఒ.శ్రీనివాస్‌తో కలిసి ఎంపిడిఒ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మండలంలో జగనన్న లేఔట్లలో 1,281 మందికిగాను 1,149 ఇళ్ల నిర్మాణాలకు మంజూరు వచ్చిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 869 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. సొంత స్థలాలవారు 2,526 మంది చేసుకున్న దరఖాస్తులను రాష్ట్ర గహ నిర్మాణ సంస్థ కార్యాలయానికి పంపామన్నారు. జగనన్న లేఅవుట్ లబ్ధిదారులకు రూ.1.80 లక్షలను దశలవారీగా అందిస్తామన్నారు. వీటితోపాటు 20 టన్నులు ఇసుక ఉచితంగా అందిస్తున్నామన్నారు. 100 బస్తాలు సిమెంటు బస్తా రూ.270 అందించినున్నట్లు తెలిపారు. ఐరన్ 450 కేజీలు ఇస్తున్నామనాఉ.బ్యాంకు లింకేజ్, స్త్రీనిధి ద్వారా రూ.35వేల నుంచి రూ.లక్ష వరకూ పావలా వడ్డీకే రుణం అందించామన్నారు. ఉపాధి ద్వారా 90 రోజుల వరకు ఒక మనిషికి మస్తర్లు కూలి రూ.30వేలు ఇచ్చామన్నారు. మరుగుదొడ్లకు రూ.12వేలను అందిస్తామన్నారు. అనంతరం పెద్దాపురంలో ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్ గోళ్ల దండియా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ తానింకి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి సాంబమూర్తి, ఎంపిటిసి సభ్యులు లాజరు, హౌసింగ్ సిబ్బంది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










