Mar 04,2023 23:27

లబ్ధిదారులకు కలెక్టర్‌ మాధవీలత సూచన
ప్రజాశక్తి - చాగల్లు
జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు స్వచ్ఛందంగా చొరవ చూపాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత సూచించారు. శనివారం చాగల్లులోని జగనన్న కాలనీలో కొత్త లే-అవుట్‌లను ఆమె పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వం ఉచితంగా అందించిన స్థలంలో ఇంటి నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి నిర్మాణం చేపట్టకోకుంటే ఇతరులు అక్రమించుకోవడం, పక్కింటి ప్రహరీ మన స్థలంలో నిర్మించుకునే అవకాశం ఉందదన్నారు. ఇంటి నిర్మాణం కొంత శ్రమతో కూడుకున్నా, వారసులకు ఒక ఆస్తి హక్కు కల్పించే చక్కని అవకాశం ఉందన్నారు. ప్రభుత్వమే ఇంటి నిర్మాణం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి, నీటి వసతి కల్పిస్తుందన్నారు. ఇంటి నిర్మాణం చేపడితే దశలవారీగా చెల్లింపులు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమవుతాయన్నారు. ఇంటి నిర్మాణం కోసం ముందస్తు పెట్టుబడిగా అవసరమైన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ఎస్‌హెచ్‌జి మహిళా సభ్యులకు రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ లే-అవుట్‌లలో విద్యుత్‌, తాగునీరు, రహదారులు వంటి పనులను దశల వారీగా ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారికి ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నామని తెలిపారు. జలజీవన్‌ మిషన్‌లో భాగంగా చాగల్లులో పాత లే అవుట్‌లో ఉన్న సుమారు 1100 గహాలకు రూ.51 లక్షలతో ఇంటింటా కొళాయి కనెక్షన్‌ ఇస్తామన్నారు.కొత్త కాలనీ వాసులకూ కనెక్షన్లు ఇస్తామని, ప్రస్తుతం ఇది టెండర్ల దశలో ఉందన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా హౌసింగ్‌ అధికారి జి.పరశురామ్‌, ఎంపిడిఒ బిబి.రాంప్రసాద్‌, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ నిరంజన్‌కుమార్‌, హౌసింగ్‌ ఎఇ ఏడుకొండలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎఇ సుర్జాన్‌, మండల గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ బి.చక్రధర్‌, సచివాలయ కార్యదర్శులు, ఉన్నారు.
తాళ్లపూడిలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు గజ్జరం గ్రామంలో సంతృప్తికరంగా ఉన్నప్పటికీ నూరు శాతం నిర్మాణాలు పూర్తి అయ్యేలా కృషి చేయాలని ఎంపిడిఒ ఎం.రాజశేఖర్‌ కోరారు. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న గృహ దినోత్సవంలో భాగంగా శనివారం గజ్జరంలో అధికారులు పర్యటించారు. నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒతో పాటు సర్పంచ్‌ డాక్టర్‌ గండి రాంబాబు, కార్యదర్శి హేమంతి, గృహ నిర్మాణ శాఖ ఎఒ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.