Feb 14,2023 23:13

డిపిటిఒలు నిర్వహించిన సమావేశానికి హాజరైన ఔత్సాహికులు

33 ఏళ్ల లీజుకు ఆర్‌టిసి కాంప్లెక్స్‌లు
ఆదాయం పెంపు, ఆధునికీకరణ అంటూ సాకులు
ఔత్సాహికులతో సమావేశం నిర్వహణ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
బస్‌ డిపోలు, కాంప్లెక్సులను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలను ఇప్పటికే బిఒటి పద్ధతిలో లీజుకు ఇచ్చిన ప్రజా రవాణా శాఖ(పిటిడి) అధికారులు... తాజాగా బస్‌ కాంప్లెక్సులనూ ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌లోని ఆర్‌ఎం కార్యాలయంలో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టే ఔత్సాహికులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాల మేరకు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నారు. అనంతరం చర్యలు తీసుకోనున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల డిపిటిఒ(డిస్ట్రిక్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌)ల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో ఆర్‌టిసి ఖాళీ స్థలాలను 15 ఏళ్ల కాలపరిమితిలో గతంలో అద్దెకు ఇవ్వగా, ఇప్పుడు ఆర్‌టిసి కాంప్లెక్సులను ఏకంగా 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడానికి ప్రజారవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన బస్టాండ్లను పబ్లిక్‌, ప్రయివేటు పార్టనర్‌షిప్‌(పిపిపి) విధానంలో లీజుకు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ఆర్‌టిసి కాంప్లెక్స్‌లు ఈ జాబితాలో వున్నాయి. ఈ మేరకు గత వారమే డిపోల మేనేజర్లకు ఉత్తర్వులు అందాయి. పిటిడి కాంప్లెక్సు స్థలాల లీజుకు సంబంధించి విధి విధానాలను ఈ సందర్భంగా ఉత్తర్వుల్లో వారికి వివరించారు. అనంతరం ఔత్సాహికుల అభిప్రాయాలు తెలుసుకుని నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నారు. ఈ మేరకు మంగళవారం రాజమహేంద్రవరంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. నివేదికలకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగల్‌ లభించిన వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. టెండర్‌ ఖరారైన తరువాత ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ భవనాలను పూర్తిగా కూల్చివేయనున్నారు. వాటి స్థానంలో కొత్త కాంప్లెక్స్‌ నిర్మిస్తారు. దీనిలో ఎన్ని అంతస్తులు వుంటాయి, పిటిడి ఎంత మేరకు వినియోగించుకోవాలి, మిగిలిన భవన సముదాయాన్ని అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంలో పిటిడి, లీజుదారుడు ఏ నిష్పత్తిలో పంచుకోవాలి తదితర వాటిపై ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేయనున్నట్టు సమాచారం. పిటిడి ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఆర్‌టిసి కాంప్లెక్సులను ఆధునికీకరించడానికి బిఒటి, పిపిపి విధానంలో స్థలాలను లీజుకు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు.