ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి సచివాలయ ఉద్యోగులను అభద్రతాభావం వెంటాడుతోంది. జిల్లాలోని పలు గ్రామ, వార్డు సచివాలయాలకు కొద్ది నెలలుగా పలు శాఖాధికారులు తనిఖీలకు దిగుతున్నారు. రోజుకో అధికారి రావడం రిజిస్టర్ కావాలని నిలదీయడమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. షోకాజ్ నోటీసుల జారీలే ధ్యేయంగా సాగుతోన్న ఉన్నతాధికారుల తనిఖీలతో జిల్లాలోని ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలన్న ఆందోళనలు అనంతరం మొదలైన ఈ తనిఖీలు ప్రస్తుతం పతాక స్థాయికి చేరాయి. ఒక వైపు పని ఒత్తిడి, మరోవైపు వేధింపులను తాళలేక బలవన్మరణానికి పాల్పడిన ఉదాహరణలు జిల్లాలో ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తర్వాత మొదలైన ఈ తనిఖీల వ్యవహారం మరింత రెట్టింపు అయ్యింది. కొన్నిసార్లు అసలు సంబంధమే లేని ఇతర శాఖాధికారులు కూడా తనిఖీలు చేయడం పరిపాటిగా మారింది. అధికారులు అడిగిన రికార్డులు చూపించకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు
షోకాజ్ నోటీసులు జారీ
జిల్లాలో సచివాల ఉద్యోగులకు షోకాజ్ నోటీసుల జారీ సర్వసాధారణంగా మారింది. కొన్నిసార్లు సంబంధం లేని రికార్డులు కోరడంతో ఉద్యోగులు బిక్క మొహం వేస్తున్నారు. ఉద్యోగులు వివరణ ఇచ్చేప్పటికే షోకాజ్ నోటీసులు అందజేసి వెళ్లిపోతున్నారు. ఒకపుడు డిపిఒ, డిఎల్‌పిఒ తర్వాత కాలంలో డిఎ్‌డిఒ కూడా తనిఖీలు చేపట్టారు. ఇటీవల కాలంలో పంచాయతీ రాజ్ శాఖ నుంచి అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. వాళ్లతో పాటు మరి కొందరు వరుస తనిఖీలకు తెరతీస్తున్నారు. ఎవరొచ్చినా 15 రకాల రికార్డులతో పాటు వాళ్ల శాఖల్లో నిర్వహించే తరహా రిజిస్టర్లను సచివాలయాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్లు, సంక్షేమ, సహాయ పథకాలకు సంబంధించిన విధులు నిర్వహించే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మొదలు డిజిటల్ అసిస్టెంట్లను కూడా 20కి పైగా రిజిస్టర్లను ఎందుకు నిర్వహించడం లేదని నిలదీస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు తొలుత విధుల్లో చేరే సమయంలో అక్కడ చేరే 11 మంది ఉద్యోగులకు విధుల్లో భాగంగా తొమ్మిది రకాల రిజిస్టర్లను అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అందులో రైస్‌కార్డు ఆన్‌లైన్ వివరాల రిజిస్టర్, పెన్షన్, ఈ సర్వీసెస్, ఆరోగ్యశ్రీ కార్డు, స్పందన, మూమెంట్ తదితర రిజిస్టర్లు ఉన్నాయి.
రెగ్యులరైజ్ అనంతరం మరింత ఒత్తిడి
ఉద్యోగులను నిర్ణీత కాలం తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని నోటిఫికేషన్ సమయంలోనే స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత కాలయాపన చేసిన విషయం విధితమే. దీంతో సచివాలయ ఉద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఆందోళనలకు చేపట్టడంతో ప్రభుత్వం దిగి వచ్చి షరతులతో కూడిన రెగ్యులరైజేషన్ అమలుచేసింది. ఆ తర్వాత నుంచే ఉద్యోగులపై ఒత్తిడి అస్త్రాలు మొదలయ్యాయి. అందులో భాగంగానే పాత రిజిస్టర్ల విషయం ప్రస్తావించకుండానే మరో తొమ్మిది రకాల రిజిస్టర్లను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాత వాటిని పక్కన పెట్టిన ఉద్యోగులు అప్పటి నుంచి నూతన విధానాలనే అవలంబిస్తున్నారు. అందులో భాగంగా కలెక్షన్స్, ఉచిత సర్వీసులు, చలానా, క్యాష్ బ్యాలెన్స్, ఎక్స్‌పెన్సెస్, రీ కన్సలేషన్, హై సెక్యూరిటీ, స్టేషనరీ, స్టాక్ అండ్ సిస్టమ్స్ అనే తొమ్మిది రిజిస్టర్లను సచివాలయ ఉద్యోగులు నిర్వహిస్తూ వస్తున్నారు. కొన్ని నెలలుగా జరుగుతోన్న తనిఖీల్లో పాత రిజిస్టర్లను కూడా అధికారులు అడుగుతుండటం ఉద్యోగులకు తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ, వార్డు సచివాలయాలకు విధులకు సంబంధించి ఏయే రిజిస్టర్లు నిర్వహించాలన్నది ఒక స్పష్టమైన జీవో ద్వారా తెలియజేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.










