Jul 10,2023 23:50

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అంగన్‌వాడీల పోరు కేకతో సబ్‌ కలెక్టరేట్‌ దద్దరిల్లింది. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 36 గంటలు నిరవధిక దీక్ష సోమవారం ప్రారంభమైంది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు సీనియర్‌ నాయకులు ఎస్‌ఎస్‌ మూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్నాయని, 40 ఏళ్లుగా పేద ప్రజలకు సేవలందిస్తున్నా తగిన గుర్తింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాల్సింది పోయి ఏటేటా తగ్గిస్తోందని, ఐసిడిస్‌ నిర్వీర్యానికి కేంద్ర, రాష్ట్ర పాలకులు కంకణం కట్టుకున్నారని అన్నారు. టిడిపి రాష్ట్ర నాయకులు లోహిత్‌, యర్రా వేణుగోపాల్‌ మాట్లాడుతూ సమస్యలు పరిస్కారం కోసం పోరాడుతున్న అంగన్వాడీలకు టిడిపి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, అసంబ్లీలో సమస్యలపై మాట్లాడతామని అన్నారు. జనసేన నాయకులు బత్తుల వెంకట లక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వీరి పోరాటానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.రాజులోవ, వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యంబ, వై.బేబీ రాణి మాట్లాడుతూ ఐసిడిఎస్‌ను పరిరక్షించడానికి 36 గంటల ధర్నా చేపట్టమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీని నిర్వీర్యం చేసే విధానాలను ముందుకు తెచ్చాయని వాటిని తిప్పికొట్టేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల ముందు జగన్‌ మోహన్‌ రెడ్డి అంగన్‌వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయలేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో రాజకీయ అధికారుల వేధింపులు తీవ్రంగా పెరిగాయని, పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని అన్నారు. రోజుకొక యాప్‌ తీసుకువచ్చి తీవ్ర పని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఈ ధర్నాలో ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల సంఘం సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షులు పి.సతీష్‌, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.రాంబాబు, ఎన్‌.రాజా, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు అన్నామణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైనసమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా నలుమూలల నుండి సుమారు 2,500 మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు హాజరయ్యారు. రెండు రోజులు వంట వార్పు కూడా దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ధర్నాలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు వై.సుజాత, సునీత, రామలక్ష్మి, అన్నపూర్ణ, ఎం.మార్త,దుర్గంబ, సుబ్బలక్ష్మి, మాలతి, సుజాత, సరద, రామాలక్ష్మి, పుష్ప, మేరీ, సూరీకుమారి, రామలక్ష్మి, టీబీ.లక్ష్మి, మరియు సెక్టర్‌ లీడర్లు పాల్గొన్నారు.