ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిల్లా కేంద్రం పరిధిలో 8 కిలోమీటర్ల లోబడి ఉన్న గ్రామాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 16 శాతం హెచ్‌ఆర్‌ఎను అమలు చేయాలం టూ పిడిఎఫ్ ఎంఎల్‌సి షేక్ సాబ్జీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ట్రెజరీ అధికారికి వినతిపత్రాలను అందించారు. జిల్లాల పునర్వి భజనలో భాగంగా రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాను ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు 16 శాతం హెచ్‌ఆర్ ఎను వర్తింపజేస్తూ ప్రభుత్వం జిఒ 27ను విడుదల చేసిందన్నారు. జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల పరిధిలో గ్రామాలు, మున్సిపాలిటీలో 16 శాతం హెచ్‌ఆర్‌ఎను ఈ జిఒ ప్రకారం అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.జయకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్ పాల్గొన్నారు.










