Jun 04,2023 23:15

కొవ్వూరులో మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌, నిడదవోలు
మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెె.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం చేపట్టిన జీపు జాగా ఆదివారం జిల్లాలో కొవ్వూరు, నిడదవోలులో సాగింది. జాతాకు కార్మికులు, సిఐటియు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కొవ్వూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని నిత్యం వారు పరిరక్షిస్తున్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పర్మినెంట్‌ సిబ్బందికి సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు నెలకు రూ.18,500 వేతం ఇవ్వాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకొచ్చిన వారంలో పరిష్కరిస్తానన్న ఏ ఒక్క సమస్యా నేటికీ పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం అప్కోస్‌ను తెచ్చామని ప్రభుత్వం చెబుతుం దన్నారు. ఆప్కోస్‌లో కార్మికులను ఉద్యోగులుగా నమోదు చేశారే తప్ప వారికి ఎలాంటి సౌకర్యాలు కలుగలేదన్నారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ సంక్షేమ పథకాలకు ఏసరు పెట్టారని తీవ్రంగా విమర్శించారు. ఎఎపి ఎఫ్‌ఆర్‌ఎస్‌, ఇకెవైసి తదితర పేర్లతో కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నరన్నారు. పట్టణాలు విస్తరించినా సిబ్బందని మాత్రం పెంచకుండా పనిభారాన్ని మోపారన్నారు. నేటికీ వందలాది మంది కార్మికులను ఆప్కోస్‌లో చేర్చకపోవడంతో వారికి హెల్త్‌ అలవెన్స్‌ అందట్లేదన్నారు. అనేక మున్సిపాలిటీల్లో కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సక్రమంగా అమలు కావడంలేదన్నారు. చనిపో యినా, అనారోగ్యం పాలైన కార్మికుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదన్నారు. మున్సిపల్‌ కార్మికుల విధి నిర్వహణలో కావాల్సిన పనిముట్లు సకాలంలో అందించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా వారి సమస్యలను పరిష్కారించాలని, డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర్‌బాబు మాట్లాడారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో వేలాదిమంది కార్మికులను జాతా కలుసుకుందన్నారు. వారి బాధలు, సమస్యలను బృందం తెలుసుకుందన్నారు. ఈ సమస్యలపై సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పూజారి వాసు అధ్యక్షత వహించారు. ఈ జాతాలో ధనాల వెంకటరావు, బి.సోమయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, మున్సిపల్‌ నాయకులు డి.రాజేంద్ర, పోతురాజు, దొడ్డ శ్యాంమ్‌, మీసాలు కళ్యాణ్‌, రాజేష్‌, కె.ప్రసాద్‌, బి.రవీంద్ర వాసు తదితరులు పాల్గొన్నారు.