Jul 29,2023 14:52

ప్రజాశక్తి - సీతానగరం : ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ములకల్లంక గ్రామానికి వరద పోటు పొంచివుంది. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో ప్రజలను, పశువులను లంకలో నుండి పునరావాస కేంద్రాలకు తీసుకురావాల్సి ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. గత సంవత్సరం వరదలకు అప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించడానికి నానాపాట్లు పడాల్సివచ్చింది. ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన రెండు పడవలు ద్వారా గ్రామస్తులు, ఉద్యోగులు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నారు. వరద ప్రవాహం వేగంగా ఉన్నప్పుడు పడవ ప్రయాణం సురక్షితం కాదు. గ్రామస్తులు నిరంతరం ప్రయాణం సాగించేలా అధికార యంత్రాంగం పడవలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. వరద ప్రవాహానికి పడవ ప్రమాదం సంభవిస్తే భారీగా ప్రాణ నష్టం వాటిల్లే అవకాశముంది. పశునష్టం, మానవ ప్రాణనష్టం జరగకుండా అధికారులు ముందస్తుగా పశువులను, గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేయాలి. ఉన్న సమాచారం మేరకు నేడు, రేపు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. బొబ్బిల్లంక గోదావరి గట్టు మీద పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో కూడా ఏడుగురు సిబ్బందితో రక్షణ చర్యలు నిమిత్తం సిద్దంగా ఉన్నాయి.