Aug 03,2023 00:05

పింగళి వెంకయ్యకు నివాళులర్పిస్తున్న విసి పద్మరాజు

ప్రజాశక్తి - రాజానగరం
ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఈసీ హాల్లో భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. పింగళి వెంకయ్య చిత్రపటానికి విసి కె.పద్మరాజు, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ పింగళి వెంకయ్యకు విద్యపై ఉన్న ఆసక్తితో ఆనాటి కాలంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. నేటి తరం విద్యార్థులు విద్యాభ్యాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చిన్నతనం నుంచి దేశభక్తితో భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ టి.అశోక్‌, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
తాళ్లపూడి : జాతీయ పతాకం రూపశిల్లి పింగళి వెంకయ్యకు పలువురు ఘనంగా నివాళులర్పించారు. రాగోలపల్లి ఎంపిపి పాఠశాలలో పింగళి జయంతిని హెచ్‌ఎం దున్నా దుర్గారావు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పింగళి వెంకయ్య గురించి విద్యార్థులకు వివరించారు. తొలుత వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.