Feb 21,2023 23:12

తాళ్లపూడిలో ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తున్న శ్రీవిజేత విద్యార్థులు

ప్రజాశక్తి- యంత్రాంగం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మంగళవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఎస్‌కెఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.రాఘవకుమారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని తెలుగుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగు శాఖ అధ్యాపకులు కెఎస్‌.అన్నపూర్ణాదేవి మాతృభాష విశిష్టతను వివరించారు. విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహించారు. విజేతలు ఎస్తేరురాణి, నీరజ, మంజుశ్రీ, దుర్గాలహరిలకు బహుమతులు అందించారు. ఐక్యూఎసి కో-ఆర్డినేటర్‌ బి.విజయభారతలక్ష్మి, అకడమిక్‌ సెల్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.అనురాధసూర్యకుమారి, వెబ్‌ సైట్‌ కమిటీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.సునీత పాల్గొన్నారు. తాళ్లపూడిలోని శ్రీవిజేత హైస్కూల్‌లో 108 మంది తెలుగు ప్రముఖుల చిత్రపటాలతో ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. పాఠశాల కరస్పాండెంట్‌ మోపిదేవి విజయలక్ష్మి, హెచ్‌ఎం డాక్టర్‌ జొన్నకూటి ప్రమోద్‌కుమార్‌, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ప్రవీణ్‌, సిబ్బంది పాల్గొన్నారు. పెరవలి మండలం అజ్జరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల-1లో జాతీయ మాతభాషా దినోత్సవం నిర్వహించారు. హెచ్‌ఎం కందికుప్ప కాశీవిశ్వనాథం మాట్లాడారు. మాతృభాష ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి చైర్మన్‌ పైలా భవాని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం తాడిపర్రు శ్రీ గారపాటి వెంకట సుబ్బారావు జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కోటిపల్లి సరోజిని ఆద్వర్యంలో మాతృభాష దినోత్సవాన్ని నిర్వమించారు. ఈ సందర్భంగా తెలుగు భాషోపాధ్యాయులు యాళ్ళబండి వెంకటస్వామి, షేక్‌ నాగూర్‌ మీరా సాహెబ్‌ మాతృభాష విశిష్టతను వివరించారు. తెలుగు ఉపాధ్యాయులను దుశ్శాలువాలతో సత్కరించారు.