Mar 24,2023 22:46

ప్రజాశక్తి-యంత్రాంగం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పుర్సస్కరించుకుని శుక్రవారం పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దానవాయిపేటలోని ఎస్‌కెవిటి స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహా హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ గోగినేని రత్నాకర్‌ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలన, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యమానికి రెడ్‌ క్రాస్‌ ఎంసీ సభ్యుడు, న్యాయవాది గొట్టిముక్కల అనంతరావు మాట్లాడుతూ కలెక్టర్‌ సూచనల మేరకు, జిల్లా అధ్యక్షులు వై.మధుసూదనరెడ్డి, కార్యదర్శి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రెడ్‌ క్రాస్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రెడ్‌ క్రాస్‌ సభ్యత్వం తీసుకుని బాధ్యతగల పౌరునిగా పాల్గొని సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ సభ్యులు డాక్టర్‌ మహాలక్ష్మి, డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ రమేష్‌ బాబు, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ విజయకుమారి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మహా హాస్పిటల్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం ఈ సందర్భంగా స్థానిక వై జంక్షన్‌ నుంచి శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రవం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దగ్గు క్రమం తప్పక రెండు వారాల వరకు ఉంటే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందులు వాడడం ప్రారంభించాలని తెలిపారు. వ్యాధి నిర్థారణ మొదలు మందులు వాడితే 6 నెలల్లో తగ్గిపోతుందని పేర్కొన్నారు. జిల్లా క్ష్యయవ్యాధి నియంత్రణాధికారి డాక్టర్‌ ఎన్‌.వసుందర, లయన్స్‌ మహిళా క్లబ్‌ కార్యదర్శి కొయ్యా కమారి, డాక్టర్‌ కిరణ్‌, డాక్టర్‌ చందన ప్రియ పాల్గొన్నారు. నల్లజర్లలో ప్రభుత్వాసుపత్రి వైద్య ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారులు డాక్టర్‌ తెల్లం గంగాధరరావు, డాక్టర్‌ మహ్మద్‌ సిరాజుద్దీన్‌ పాల్గొన్నారు. ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ కలిదిండి వెంకట చంద్రశేఖరరాజు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. దేవరపల్లి పంచాయతీ వద్ద క్షయ వ్యాధి నివారణ వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి ఎంపిపి కెవికె.దుర్గారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి నివారణ కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కడిమి వీర కుమారి, పంచాయతీ కార్యదర్శి ఎన్‌.కిషోర్‌ పాల్గొన్నారు