ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
తూర్పుగోదావరి జిల్లా తొలి ఆవిర్భా దినోత్సవం మంగళవారం స్థానిక ఆనం కళా కేంద్రంలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా హోం మంత్రి తానేటి వనిత, ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, తలారా వెంకట్రావు, రుడా చైర్మన్ షర్మిళారెడ్డి, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడారు. నూతన జిల్లాల ఆవిష్కరణ సత్ఫలితాలను అందిస్తున్నాయన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ దిశగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. ప్రజలకు మరింత సుపరిపాలన అందించే క్రమంలో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా 19 మండలాలతో నూతన తూర్పుగోదావరి జిల్లా ఏర్పాటు అయ్యిందన్నారు. తొలి జిల్లా కలెక్టర్‌గా మాధవీలత భాద్యతలు చేపట్టారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అభివద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
అనంతరం కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత మాట్లాడారు. ఏడాది కాలంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వ యం సాధించడం ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. ఇందుకు సహక రించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది ఎదుర్కొన్న సమస్యలను అధిగమించి ముందుకు అడుగులు వేస్తున్నామన్నారు. జిల్లాలో పారిశ్రామికంగా, పర్యాటక కేంద్రంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే తరహాలో అందరకూ సహకారర అందించాల న్నారు. జిల్లాలో 100 ఔత్సహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.3.56 కోట్ల సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు అందించామన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 139 ఐఎఎస్‌లు పాల్గొన్నశిక్షణా తరగతుల్లో జెసి ఎన్. తేజ్‌భరత్ తన ప్రతిభతో మొదటి స్థానంలో నిలిచి జిల్లా ఖ్యాతిని పెంచారన్నారు.
గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలో నియోజక వర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించేదుకు కలక్టరు చొరవ తీసుకున్నారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం పట్ల విద్య, వైద్యానికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో అర్థమవుతుంద న్నారు. రాజనగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అన్ని రంగాల్లో ముందడగు వేస్తున్నామన్నారు. జిల్లాలో ఎటువంటి వివక్షలకు తావు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. సభకు అధ్యక్షత వహించిన జెసి తేజ్‌భరత్ జిల్లా అభివృద్ధిపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్‌కుమార్, డిఆర్‌ఒ జి.నర సింహులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు ఈ స్టాల్స్‌ను సందర్శించారు.










