Apr 09,2023 23:15

ధవళేశ్వరంలో విద్యుత్‌ వెలుగుల్లో సమాధులతోట

ప్రజాశక్తి - యంత్రాంగం
జిల్లాలో ఈస్టర్‌ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు తెల్లవారు జామునే సమాధులను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు న్విహించారు. ధవళేశ్వరంలో ఈస్టర్‌ సందర్భంగా క్రైస్తవులు ఆదివారం తెల్లవారుజాము నుంచే సమాధుల తోటలో ప్రార్థనలు జరిపారు. అనంతరం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉండ్రాజవరం మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అలాగే సమాధులను సందర్శించి కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. చర్చిల వద్ద అన్న సమారాధనల నిర్వహించారు. కొవ్వూరు రూరల్‌లో నిర్వహించిన ఈస్టర్‌ వేడుకల్లో హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఒకరిపట్ల ఒకరు ప్రేమతో, దయాగుణంతో వ్యవహరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొవ్వూరు పట్టణంలోని సమాధుల తోటలో ఈస్టర్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం దేవరపల్లి మండలం గౌరీపట్నం, తాళ్లపూడి మండలం తుపాకులగూడెంలో పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించారు. తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో నిర్వహించిన ఈస్టర్‌ ప్రార్థనల్లో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. మంత్రి వెంట మాజీ ఎంఎల్‌ఎ జొన్నకూటి బాబాజీరావు సోదరుడు కుమార్‌, జడ్‌పి వైస్‌ చైర్మన్‌ పోసిన శ్రీలేఖ వైసిపి నాయకులు ఉన్నారు. వేగేశ్వరపురం లూథరన్‌ చర్చి వద్ద మానవతా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. కుల మతాలకతీతంగా ప్రజలకు సహకరించడమే మానవతా ధ్యేయమని మండల శాఖ అధ్యక్షులు జోడాల వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుబ్బారావు, కోశాధికారి ఆంజనేయులు, ఈసీ మెంబర్‌ సనపల రాజశేఖర్‌, రీజనల్‌ చైర్మన్‌ వి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. గోపాలపురంలో ఈస్టర్‌ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిపారు. సమాధులను పూలు, కొవ్వుత్తులతో అలంకరించారు. గోపాలపురం సెయింట్‌ పౌల్స్‌ లూథరన్‌ దేవాలయంలో పాస్టర్‌ గెల్లా రాజన్‌బాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. మండలంలో అన్ని గ్రామాలలో దేవాలయాలలో ఈస్టర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.